తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువల సవరణలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అక్టోబర్ నెల ప్రారంభం నుంచి కొత్త మార్కెట్ రేట్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. విలువల సవరణలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసి.. ప్రభుత్వానికి పంపింది కూడా. అయితే, ఆనవాయితీ ప్రకారం భూముల మార్కెట్ విలువలు ఎప్పుడు సవరించినా సరే ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. కానీ, ఈ ఏడాది మాత్రం ప్రభుత్వం అనుమతించినా ఆగస్టు1 నుంచి సవరించిన విలువలు అమల్లోకి వచ్చే అవకాశం లేదని, అక్టోబరు నాటికి వస్తాయని తెలుస్తోంది.
2013 నుంచి పెరగని విలువలు..
భూములకు మార్కెట్ విలువ నిర్ధారణ అనేది అత్యంత కీలకమైన అంశం. స్థలాల క్రయవిక్రయాల లావాదేవీలతో పాటూ నష్ట పరిహార చెల్లింపుల విషయంలోనూ మార్కెట్ రేటు ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. 2013 సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎన్ కిరణ్కుమార్ రెడ్డి ప్రభుత్వ హాయంలో మార్కెట్ విలువలను సవరించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అవే విలువలున్నాయి. వాటి ఆధారంగానే రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి.
ఆ తర్వాత అభివృద్ధి ఎంతో..
ఆరు సంవత్సరాల నుంచి కనీసం రెండుసార్లు అయిన భూమల విలువల సవరణ జరగాల్సింది. కానీ, అలా జరగలేదు. 2013 నుంచి నేటి వరకు రాష్ట్రంలో అభివృద్ధి బాగా జరిగింది. దీంతో బహిరంగ మార్కెట్లో భూముల విలువలు కూడా అమాంతం పెరిగాయి. ఆరు సంవత్సరాల నుంచి మార్కెట్ విలువలో హెచ్చుతగ్గులు లేకపోవడంతో కొన్ని భూములు, ఆస్తులకు రిజిస్ట్రేషన్ల విలువను రెండింతలు ఎక్కువగా వేసి మరీ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న సందర్భాలున్నాయి.
విలువల పెంపు ఆషామాషీ కాదు..
అయితే, భూముల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియ కోసం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ముందుగా రాష్ట్ర స్థాయిలో రిజిస్ట్రేషన్లు, వ్యవసాయ, రెవెన్యూ ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ కమిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లు చైర్మన్లుగా కమిటీలను నియమించుకోవాలి. వ్యవసాయ భూములకు ఆర్డీవోలు, వ్యవసాయేతర భూములకు జాయింట్ కలెక్టర్లు కన్వీనర్లుగా కమిటీలను ఏర్పాటు చేసుకుని మండల, గ్రామాల వారీగా భూముల మార్కెట్ విలువలన సవరించాల్సి ఉంటుంది. ఆ సవరణ ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి పంపితే, ప్రభుత్వ ఆమోదం అనంతరం ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు.