తెలంగాణలో కొత్త మున్సిపల్ చట్టం అమలుతో అక్రమ నిర్మాణాలకు ఫుల్స్టాప్ పడనుంది. అక్రమ నిర్మాణదారులు, కబ్జాదారులకు అడ్డుకట్ట వేసేందుకు మున్సిపల్ చట్టంలో మార్పులు చేశారు. జైలు శిక్ష, జరిమానాలతో అక్రమ నిర్మాణదారులకు హడలెత్తించనున్నారు.
జీహెచ్ఎంసీలో 50 శాతం నిర్మాణాలు డీవియేషనే..
తెలంగాణలో అక్రమ భవన నిర్మాణాలు చేపట్టే వారికి, ప్రోత్సహించే వారికి మూడేళ్లు జైలు శిక్ష లేదా నిర్మాణ వ్యయంలో 25 శాతం జరిమానా విధించేలా కొత్త మున్సిపల్ చట్టంలో నిబంధనలు చేర్చారు. అక్రమ భవన నిర్మాణాలు, ఓపెన్ ప్లాట్లను కూల్చేయడంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు శ్రమించాల్సి వస్తోంది. అయితే కొత్త మున్సిపల్ చట్టంలో వీటికి పరిష్కారం దొరకనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో 22 లక్షల భవనాలుండగా.. 50 శాతం నిర్మాణాల్లో డీవియేషన్స్ ఉన్నాయని, మరొక 10 శాతం భవనాలు అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ రికార్డులు చెబుతున్నాయి.
పార్కింగ్ ప్లేస్లో నో నిర్మాణాలు..
భవన నిర్మాణ ప్రణాళికల్లో పార్కింగ్ కోసం కేటాయించే స్థలంలో నిర్మాణాలను నిలిపివేయాలని కొత్త బిల్లులో ప్రతిపాదించారు. ఆయా ప్రభుత్వ విభాగాల భౌతిక పర్యవేక్షణ తర్వాతే నిర్మాణాలకు అనుమతులిస్తారు. ఒకవేళ పార్కింగ్ కోసం కేటాయించిన స్థలంలో ఏదైనా నిర్మాణాలు చేపట్టినట్లయితే.. స్థలం విలువలో 25 శాతం జరిమానా విధించాలని మున్సిపల్ చట్టంలో ప్రతిపాదించారు.
సమాచారమిస్తే ప్రోత్సాహకాలు..
పట్టణ ప్రణాళిక విభాగంలో అవినీతిని అరికట్టడానికి కూడా కొత్త మున్సిపల్ చట్టంలో నిబంధనలను ప్రతిపాదించారు. భవన యజమానులు స్వీయ ధ్రువీకరణ పత్రం ద్వారా నిర్మాణ అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవటానికి కొత్త మున్సిపల్ చట్టంలో వీలు కల్పించారు. ఒకవేళ ఎవరైనా తప్పుడు సమాచారంతో దరఖాస్తు చేసుకుంటే గనక.. జైలు శిక్ష, జరిమానా రెండూ విధించే అవకాశముంది. అంతేకాకుండా అనధికారిక నిర్మాణాలు, కబ్జాదారుల వివరాలను జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రతిపాదిత మున్సిపల్ బిల్లులో ప్రోత్సాహకాలను ప్రకటించారు. అయితే ఈ ఇన్ఫార్మర్ల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.