Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

అక్రమ లే–అవుట్లు నేలమట్టమే!

తెలంగాణలో పేట్రేగిపోతున్న అక్రమ లే–అవుట్లపై హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కన్నెర్ర చేసింది. అనుమతి లేకుండా అడ్డగోలుగా పుట్టుకొచ్చిన లే–అవుట్లను తొలగించాలని నిర్ణయించింది. హెచ్‌ఎండీఏ విస్తరించి ఉన్న ఆరు జిల్లాల్లోని 849 గ్రామాల్లో లే–అవుట్లను తనిఖీ చేసింది. ల్యాండ్‌ రెగ్యులైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌)కు రెండుసార్లు అవకాశం కల్పించిన తర్వాత కూడా ఇలా ఇబ్బడిముబ్బడిగా అక్రమ లే–అవుట్లు పుట్టుకురావడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ..
తెలంగాణ వ్యాప్తంగా వెలిసిన అక్రమ లే–అవుట్లను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రత్యేంగా బృందం ఏర్పాటైంది. క్షేత్రస్థాయిలో లేఅవుట్ల సర్వే నిర్వహించిన యంత్రాంగం.. అందులో ఏయే వెంచర్లకు అనుమతులున్నాయి? అనధికార లే–అవుట్లు ఎన్ని? అనే అంశంపై సమాచారాన్ని రాబట్టింది. ఈ వివరాల ఆధారంగా అక్రమార్కులకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
అభివృద్ధి పనులు హుళక్కే..
లే–అవుట్లలో రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు తదితర మౌలిక వసతులు కల్పించకుండానే.. లేఅవుట్లను ఏర్పాటు చేస్తున్నారు డెవలపర్లు. మార్కెట్‌లో ఇవి చౌక ధరకు లభిస్తుండడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు అనధికార లే–అవుట్లలో ప్లాట్లు కొనేందుకు ఎగబడుతున్నారు. అక్రమ వెంచర్లకు కళ్లెం వేయాలనే ఉద్ధేశంతో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అధికార, అనధికార లే–అవుట్లను నోటిఫై చేసింది. 2018 పంచాయతీరాజ్‌ చట్టం మనుగడలోకి వచ్చిన వెంటనే ఇలాంటి లే–అవుట్లను గుర్తించింది. ఆ తర్వాత వెలిసిన అక్రమ లే–అవుట్లకే తాజాగా హెచ్‌ఎండీఏ నోటీసులు జారీ చేస్తోంది. డెవలపర్లకు తాఖీదులు ఇస్తూ వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో లే–అవుట్లను నేలమట్టం చేస్తామని హెచ్చరిస్తోంది.

Related Posts

Latest News Updates