అమ్యూజ్మెంట్ పార్క్ ..పిల్లలకు వినోదాన్నే కాదు. కాసులు కురిపించే పరిశ్రమగా ఎంటర్ప్రెన్యూర్లను ఆకర్శిస్తోంది. వచ్చే నాలుగేళ్లలో దేశ వ్యాప్తంగా 175 బిలియన్ రూపాయల వ్యయంతో 12 మేజర్ ప్రాజెక్టులు ఈ రంగంలో రూపుదిద్దుకోనున్నాయి. కొత్తగా హైదరాబాద్‌లో రూ. 250 కోట్ల వ్యయంతో ‘వండర్లా’ అమ్యూజ్మెంట్ పార్కు కొలువుదీరనుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా ప్రాజెక్టుకు సంబంధించిన మూలధన సమీకరణ కోసం కొచ్చిన్‌కు చెందిన ఈ సంస్థ ప్రయత్నాలు మొదలు పెట్టింది. పట్టణాల్లో పెరుగుతున్న జనాభా, చిన్న కుటుంబాలు, భార్యా భర్తలిద్దరూ ఉద్యోగస్తులు కావడం, మిగులు ఆదాయాలు పెరగటం, ఆటస్థలాలు కనుమరుగవడం లాంటి కారణాలతో నగరాల్లో అమ్యూజ్మెంట్ పార్కులకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ముంబైలో ఎస్సెల్ పార్క్ , కోల్‌కతాలో నిక్కో పార్క్, చెన్నైలో కిష్కిందా, హైదరాబాద్‌లో ఓషియాన్ పార్క్, రామోజీ ఫిల్మ్ సిటీ, మౌంట్ ఒపేరా లాంటి అమ్యూజ్మెంట్ పార్కులు పిల్లలకు వినోదాన్ని పంచటంలో ల్యాండ్‌మార్క్‌గా నిలిచిపోయాయి.
అమ్యూజ్మెంట్ పార్కులంటే…
ఎక్కువమంది వ్యక్తులకు వినోదం అందించేందుకు రకరకాల వినోద సాధనాలను ఒకే చోట ఏర్పాటు చేసి వాటి వినియోగం ద్వారా ఆదాయం సమకూర్చుకొనటమే అమ్యూజ్మెంట్ పార్క్ కాన్సెప్ట్. ఇందులో డ్రై రైడ్స్, వెట్ రైడ్స్, స్నో పార్క్స్, రిసార్ట్స్ ఇలా రకరకాల కేటగిరీలో అమ్యూజ్మెంట్ పార్కులు రూపు దిద్దుకుంటన్నాయి. పూర్తి స్థాయి వినోదాన్ని అందించే ఎంటర్టైన్మెంట్ హబ్బులుగానూ వెలుస్తున్నాయి. వీటిల్లో అదనపు ఆకర్షణలుగా రిసార్టు, షాపింగ్‌మాల్, గోల్ఫ్ కోర్సులను ఏర్పాటు చేస్తున్నారు.
టూరిజం ఇన్‌ఫ్లో…
దేశీయ డిమాండ్‌తో పాటు టూరిజం ఇన్‌ఫ్లో ద్వారా అమ్యూజ్మెంట్ పార్కులు మంచి వ్యాపార సాధనాలుగా మారాయి. టూరిజం అండ్ హాస్పిటాలిటీ సెక్టార్ ద్వారా 2011లో 35.2 బిలియన్ డాలర్ల ఆదాయం దేశీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో జమఅయిందని ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫోరమ్ నివేదిక పేర్కొంది. వచ్చే నాలుగైదేళ్లలో టూరిజం వార్షిక సగటు వృద్ధి రేటు ఎనిమిది శాతంగా ఉంటుందని ఆ నివేదిక అంచనా వేస్తోంది. అంతర్ రాష్ట్ర టూరిజం వృద్ధి 2010 స్థాయితో పోలిస్తే 13.5 శాతం పెరిగి 2011 నాటికి 85 కోట్లకు చేరింది. విదేశీ టూరిస్టులు 2011లో 1.95 కోట్ల మంది ఇండియా సందర్శించారు. ఇది అంత క్రితం సంవత్సరంతో పోలిస్తే 9 శాతం వృద్ధి నమోదు చేసిందని కేర్ నివేదిక పేర్కొంది.
తొలి అమ్యూజ్మెంట్ పార్కు…
ఇండియాలో తొలి అమ్యూజ్మెంట్ పార్కు ‘అప్పూ ఘర్’ 1984లో ఢిల్లీలో ఏర్పాటైంది. 1990 దశకంలో ఎస్సెల్ వరల్డ్, నిక్కోపార్క్, రామోజీ ఫిల్మ్ సిటీల ఏర్పాటుతో ఇది పరిశ్రమ స్థాయిని అందుకుంది. ప్రపంచంలో అతి పురాతన అమ్యూజ్మెంట్ పార్కు 1583లో డెన్మార్క్‌లో కొపెన్హేగెన్కు ఎగువన బాక్కెన్ అనే ప్రాంతంలో వెలిసింది. రష్యాలో 17 వ శతాబ్దంలో వింటర్ స్పోర్ట్‌గా ప్రాచుర్యం పొందిన రోలర్ కోస్టర్ రైడ్ అమెరికాలో 19వ శతాబ్దంలో పెద్ద హిట్ అయింది. 1955లో డిస్నీలాండ్ ఏర్పాటైన తర్వాత అమ్యూజ్మెంట్ పార్కుల స్వభావమే మారిపోయింది.
వ్యాపార వృద్ధి…
ప్రస్తుతం ఇండియలో మొత్తం 150 అమ్యూజ్మెంట్ పార్కులున్నాయని, అందులో 16–18 పార్కులు పెద్దవి కాగా, 40–45 పార్కులు మధ్య స్థాయివని కేర్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. ఏటా సగటున 58–60 మిలియన్ ఫుట్‌ఫాల్స్ ఉంటాయని అంచనా వేస్తోందీ నివేదిక. పరిశ్రమ వ్యాపార పరిమాణం రూ. 2,600 కోట్లు. ఏటా 10 నుండి 15 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 25 బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తోందీ పరిశ్రమ.
పరిశ్రమ వృద్ధికి అవరోధాలు..
అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటుకు ప్రధానంగా కావాల్సింది భూమి, యంత్ర సామాగ్రి, జల వనరులు, రవాణా సౌకర్యం. ప్రధాన నగరాల్లో భూముల విలువలు పెరగడంతో పెట్టుబడులు బాగా పెరిగిపోయాయని అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటుకు కన్సల్టెన్సీ సేవలందించే చెన్నైకి చెందిన దినకరణ్ చెప్పారు. పూర్తిగా యంత్ర సామాగ్రిపై ఈ పరిశ్రమ ఆధారపడటంతో ప్రారంభ పెట్టుబడులు అధికంగా ఉంటున్నాయన్నారు.