మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నిర్వహణలో ఉన్న హైదరాబాద్ – విజయవాడ రహదారి, కాకినాడ సెజ్‌లో కొంత స్థలాన్ని విక్రయించాలని నిర్ణయించింది. 2019–20 ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి 4 ప్రధాన రోడ్ ప్రాజెక్ట్‌లను, ఏపీ, తమిళనాడులోని పారిశ్రామిక స్థలాలను విక్రయించాలని నిర్ణయించింది. జీఎంఆర్ కార్పొరేట్ రుణ భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
5 హైవే ప్రాజెక్ట్‌లు ఫర్ సేల్..
ప్రస్తుతం జీఎంఆర్ ఇన్ఫ్రాకు 6 హైవే ప్రాజెక్ట్‌లున్నాయి. ఇందులో 4 ప్రాజెక్ట్‌లను హైదరాబాద్ – విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే, అంబలా – చంఢీఘడ్ ఎక్స్‌ప్రెస్‌వే, పోచన్నపల్లి ఎక్స్‌ప్రెస్‌వే, చెన్నై ఔటర్ రింగ్ రోడ్డులను విక్రయించాలని నిర్ణయించింది. ఇందులో హైదరాబాద్ – విజయవాడ, అంబలా – చంఢీఘడ్ ఎక్స్‌ప్రెస్‌వేలు టోల్ ప్రాజెక్ట్స్. ఆయా రహదారి ప్రాజెక్ట్లల్లో ట్రాఫిక్ వృద్ధి బాగుందని కంపెనీ తెలిపింది. ఈ నాలుగు ప్రాజెక్ట్‌ల మీద కంపెనీ రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. హైవే ప్రాజెక్ట్‌లతో పాటూ తూర్పు గోదావరి కాకినాడలోని స్పెషల్ ఎకనామిక్ జోన్, తమిళనాడులోని కృష్ణగిరి వంటి ఇతర పారిశ్రామిక ప్రాంతాల్లో కొంత భాగం స్థలాలను విక్రయించాలని నిర్ణయించింది.
కార్పొరేట్ రుణ భారం తగ్గింపే లక్ష్యం..
మార్చి చివరి నాటికి జీఎంఆర్ ఇన్ఫ్రాకు కన్సాలిడేషన్ రుణం రూ.21 వేల కోట్లుగా ఉంది. ఇందులో రూ.11 వేల కోట్లు కార్పొరేట్ రుణం వాటా ఉంది. మిగిలింది ఆపరేషనల్ ప్రాజెక్ట్స్ రుణం. వీటి నుంచి రోజు వారీ కార్యకలాపాలతో ఆదాయం సమకూరుతుంది. ఇటీవలే జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో మైనారిటీ వాటాను విక్రయించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. టాటా గ్రూప్, జీఐసీ, ఎస్ఎస్జీ క్యాపిటల్ మేనేజ్మెంట్లకు వాటా విక్రయ ఒప్పందంతో రూ.8 వేల కోట్ల సమీకరించింది. దీంతో కార్పొరేట్ రుణ మొత్తం రూ.11 వేల కోట్ల నుంచి రూ.3 వేల కోట్లకు తగ్గింది. రోడ్ ప్రాజెక్ట్‌లు, పారిశ్రామిక స్థలాల విక్రయంతో ఈ మొత్తాన్ని కూడా తీర్చేయాలన్నది జీఎంఆర్ లక్ష్యం.
విమానాశ్రయాల విస్తరణ..
ప్రస్తుతం జీఎంఆర్ ఇన్ఫ్రా.. హైదరాబాద్, ఢిల్లీలతో పాటూ ఫిలిప్పిన్స్‌లోని సీబూ విమానాశ్రయాన్ని కూడా నిర్వహణ చేస్తుంది. ఆయా ఎయిర్పోర్ట్స్లను విస్తరిండంతో పాటూ ఇదే రంగంలో కొత్త ప్రాజెక్ట్‌లను చేపట్టడంపై దృష్టిసారించామని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సౌరభ్ చావ్లా తెలిపారు.