Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

అసంపూర్తి గృహాలకు రూ.10 వేల కోట్ల ప్రత్యేక నిధి

దేశంలో మధ్యలో ఆగిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లల్లో కదలిక రానుంది. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలకు పరిష్కారం చూపించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో రూ.10 వేల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించి ఆగిపోయిన గృహ నిర్మాణాలను పూర్తి చేయనుంది. ఈ మేరకు ఫోరం ఫర్‌ పీపుల్స్‌ కలెక్టివ్‌ ఎఫోర్ట్స్‌ (ఎఫ్‌పీసీఈ) కేంద్రాన్ని కోరింది.
5.6 లక్షల గృహాలు..
దేశంలో రెరా అమలులో ఉన్నప్పటికి కూడా నిర్మాణంలో ఉన్న చాలా ప్రాజెక్ట్‌లు పూర్తి కావటం లేదు. దీంతో ఏటేటా స్టాక్‌ పెరిగిపోతుంది. అనరాక్‌ నివేదిక ప్రకారం దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 5.6 లక్షల గృహాలు అసంపూర్తిగా ఉన్నాయి. వీటి విలువ సుమారు 4,51,650 కోట్లు. ఆయా గృహాలు 2013 కంటే ముందు ప్రారంభించినవే.
ఈ ప్రత్యేక నిధి ప్రధాన లక్ష్యం.. పెండింగ్‌లో ఉన్న అసంపూర్తి నిర్మాణాలను వచ్చే ఐదేళ్లలో పూర్తి చేయడమే. అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేస్తే.. ఐదు లక్షల మంది గృహ కొనుగోలుదారులకు ఊరట కలుగుతుందని ఎఫ్‌పీసీఈ తెలిపింది. దీంతో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెండింగ్‌ ప్రాజెక్ట్‌లు ఉండవు. కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుంది. రెరా చట్టం అమలుతో అసంపూర్తి నిర్మాణాలకు అవకాశం తక్కువగా ఉంటుందని పేర్కొంది.
టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు..
నిర్మాణం తది దశకు చేరుకున్న ప్రాజెక్ట్‌లను గుర్తించేందుకు కేంద్ర గృహ, పట్టణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఎఫ్‌సీసీఏ సిఫారసు చేసింది. ముందుగా ఈ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని, నిర్మాణ పనులకు ప్రభుత్వ రంగ సంస్థలను గుర్తించాలని తెలిపింది.
డెవలపర్లు జీవితకాలం నిషేదం..
అసంపూర్తిగా వదిలేసిన ప్రాజెక్ట్‌ ప్రమోటర్లు, డెవలపర్ల వ్యక్తిగత, కంపెనీ ఆస్తులను కూడా ప్రత్యేక నిధి కేటాయింపుల కోసం వెచ్చించాలని సూచించింది. అంతేకాకుండా ఆయా డెవలపర్లను జీవిత కాలం పాటు నిషేదించాలని తెలిపింది. పట్టణాభివృద్ధి సంస్థలు వినియోగించని స్థలాలను, ఎస్క్రో ఖాతాలోని రీఫండ్‌ సొమ్మును వినియోగించి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి వినియోగించాలని డెవలపర్లు సూచించారు.

Related Posts

Latest News Updates