కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) 19వ న్యాట్‌కాన్ సదస్సు ఇజ్రాయిల్‌లో జరగనుంది. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో టెల్ అవీవ్‌లోని ఇంటర్ కాంటినెంటల్ హోటల్లో న్యాట్‌కాన్ జరగనున్నట్లు కన్వినర్ గుమ్మి రాంరెడ్డి తెలిపారు.
ప్రతి ఏటా న్యాట్‌కాన్ నిర్వహించే క్రెడాయ్‌కి ఈసారి ఒక ప్రత్యేకత ఉంది. తొలిసారిగా తెలుగు రాష్ట్రం న్యాట్‌కాన్‌ను నిర్వహిస్తుందని.. న్యాట్‌కాన్–2019 నిర్వహణ బాధ్యతలను క్రెడాయ్ తెలంగాణ చేపడుతుందని రాంరెడ్డి తెలిపారు. సదస్సులో చిన్న, మధ్య స్థాయి డెవలపర్లతో పాటూ దేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఆర్ధిక సంస్థలు, రియల్టీ ఏజెన్సీలు పాల్గొననున్నాయి.
25 మంది స్పీకర్లు..
మూడు రోజుల ఈ సదస్సులో రెండు రోజుల పాటూ ప్రత్యేక సెషన్స్ ఉంటాయి. ఇజ్రాయిల్ దేశంలోని వ్యాపార అవకాశాలు, మార్కెటింగ్, స్థానిక స్థితి గతులు, సాంకేతికత, రీసైక్లింగ్, నిర్మాణ రంగంలో వినియోగిస్తున్న టెక్నాలజీ తదితర అంశాలపై అంతర్జాతీయ వక్తలు ప్రసంగిస్తారు. సుమారు 25 మంది స్పీకర్లు పాల్గొంటారని అంచనా.
1300 మంది డెవలపర్ల హాజరు..
సాధారణంగా ప్రతి ఏడాది క్రెడాయ్ న్యాట్‌కాన్‌కు 700 మంది హాజరవుతుంటారు. కానీ, ఈసారి రిజిస్ట్రేషన్స్ ప్రారంభించిన నెల రోజుల్లోనే 1,100 బుకింగ్స్ అయ్యాయి. ఇప్పటివరకు 1,300 రిజిస్ట్రేషన్స్ జరిగాయి. తెలంగాణ నుంచి 200ల మందికి పైగా డెవలపర్లు, ఆంధ్రప్రదేశ్ నుంచి 71 మంది డెవలపర్లు పాల్గొంటున్నారని, రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని రాంరెడ్డి తెలిపారు.