Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఆదిభట్ల ఎయిరో సిటీ!

గచ్చిబౌలి, మాదాపూర్‌ ప్రాంతాలు ఎలాగైతే ఐటీ కంపెనీలతో హైటెక్‌ సిటీగా అభివృద్ధి చెందాయో.. ఆదిభట్ల ప్రాంతం వైమానిక (ఎయిరో) కంపెనీలతో ఎయిరో సిటీగా అభివృద్ధి చెందుతోంది. ఐటీ కంపెనీలున్న చోట స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతుందన్నది తెలిసిన సంగతే! మరి, ఐటీ సంస్థలతో పాటూ ఎయిరో స్పేస్‌ కంపెనీలూ కొలువుదీరితే? భవిష్యత్తు రియల్‌ అభివృద్ధి ఢోకా ఉండదన్నట్టేగా! ఇదీ సింపుల్‌గా చెప్పాలంటే ఆదిభట్ల గురించి!
టీసీఎస్‌తో వృద్ధి మొదలు..
ఆదిభట్లలో రియల్‌ పరుగులు ప్రారంభమైంది టీసీఎస్‌ ప్రారంభంతోనే! ఆ తర్వాత కాగ్నిజెంట్, కన్వెర్జిస్‌ వంటి సంస్థలూ రావటంతో అసలైన బూమ్‌ మొదలైంది. మరోవైపు దేశంలోనే తొలి ఎయిర్‌స్పేస్‌ సెజ్‌కు ఆదిభట్ల ఎంపిక కావటం, ఔటర్‌ రింగ్‌ రోడ్డూ అందుబాటులోకి రావటంతో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. ఇది ఆదిభట్లతోనే ఆగిపోకుండా ఇబ్రహీంపట్నం, యంజాల్, మన్నెగూడ క్రాస్‌ రోడ్, బొంగ్లూరు, కొంగరకలాన్, మంగల్‌పల్లి ప్రాంతాలకూ విస్తరించింది. 2002లో ఎకరం రూ.6 లక్షలు పలికిన ఆదిభట్లలో ఇప్పుడు రూ.4 కోట్ల పైమాటే. ఇది చాలదూ.. ఆదిభట్ల స్థిరాస్తి వ్యాపార అభివృద్ధి గురించి చెప్పడానికి!
వైమానిక జోష్‌..
ఇటీవల కాలంలో ఆదిభట్ల ప్రాంతంపై ఐటీ, వైమానిక తయారీ కంపెనీలు, డిఫెన్స్‌ కంపెనీలు దృష్టిసారించాయి. ఇప్పటికే స్థానిక ఎయిర్‌స్పేస్‌ సెజ్‌లో టాటా అడ్వాన్డ్స్‌ సిస్టమ్, టాటా లాక్హీడ్‌ మార్టిన్, టాటా సికోర్‌ స్కై, సమూహా, డెస్మీ ఇండియా వంటి సంస్థలున్నాయి. వీటిల్లో సుమారు 30 వేల మంది ఉద్యోగులుంటారని సమాచారం. గతంలో బీడీఎల్, ఆక్టోపస్, బెల్, ఎన్‌ఎస్‌జీ, సీఆర్‌పీఎఫ్‌ వంటి కేంద్ర సంస్థల విస్తరణ, కార్యకలాపాల కోసం ఇబ్రహీంపట్నంలో స్థలాలను కేటాయించారు. భవిష్యత్తులో ఇవి కూడా కార్యరూపం దాల్చితే ఇబ్రహీంపట్నం ముఖచిత్రం మారుతుందనడంలో సందేహమక్కర్లేదు. అంతేకాకుండా గత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్‌ ప్రాజెక్ట్‌లో.. క్లస్టర్‌–3లోని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ అథారిటీలో ఆదిభట్ల, మహేశ్వరం, రావిరాల, మామిడిపల్లి ప్రాంతాలున్నాయి. ఇవి 79.2 చ.కి.మీ. పరిధిలో విస్తరించి ఉంది. దీంతో ఐటీ కంపెనీలూ ఆయా ప్రాంతాలపై దృష్టిసారిస్తున్నాయి.
70 శాతం ఓపెన్‌ ప్లాట్లే..
ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, బొంగ్లూరు వంటి ప్రాంతాల్లో జేబీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, సీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, మెట్రో సిటీ డెవలపర్స్, శ్రీ శ్రీ హోమ్స్, శ్రీసాయి బాలాజీ ఎస్టేట్స్‌ వంటి సంస్థలు ఓపెన్‌ లే అవుట్లు, విల్లాలు, అపార్ట్‌మెంట్లున్నాయి. అయితే ఆయా ప్రాంతాల్లో 70 శాతం ఓపెన్‌ ప్లాట్లే ఉంటాయని, మిగిలిన 30 శాతంలో విల్లాలు, అపార్ట్‌మెంట్లు ఉంటాయి. ఇక్కడ ధర చ.అ.కు రూ.2,500ల నుంచి, ఓపెన్‌ ప్లాట్లు చదరపు అడుగుకు 2 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. 
విద్య, వైద్య, వినోద కేంద్రాలూ..
ఆదిభట్ల నుంచి బొంగ్లూరు ఔటర్‌ రింగ్‌ రోడ్డు జంక్షన్‌ మీదుగా 15 నిమిషాల ప్రయాణ వ్యవధిలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. అలాగే 13 కి.మీ. పరిధిలో ఎల్బీనగర్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో రైలు స్టేషన్‌ ఉండటం ఈ ప్రాంతానికి కలిసొచ్చే అంశాలు. ఇక్కడి విద్య, వైద్య, వినోద కేంద్రాలను పరిశీలిస్తే.. నాగార్జున్‌ సాగర్‌ రోడ్డు ముందు నుంచి కూడా ప్రశాతంమైన, ఆరోగ్య వాతావరణానికి పేరొందిందని జేబీ ఇన్‌ఫ్రా పార్టనర్‌ గోవర్ధన్‌ రెడ్డి తెలిపారు. సీవీఆర్, గురునానక్, భారతి, శ్రీఇందు వంటి ప్రముఖ ఇంజనీరింగ్‌ కళాశాలలు, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్, శ్లోకా వంటి అంతర్జాతీయ పాఠశాలలూ ఉన్నాయి. ఆర్డీవో, ఆర్‌టీఏ, కలెక్టరేట్‌ కార్యాలయాలున్నాయి. కృష్ణా త్రాగు నీరు, నిరంతర విద్యుత్‌ సరఫరా, విస్తారమైన భూగర్భ నీళ్లూ ఉన్నాయిక్కడ.

Related Posts

Latest News Updates