తెలంగాణలో ఇసుకకు డిమాండ్ పెరుగుతుంది. బిల్డర్లు వర్షాకాలంలో వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ముందే స్టాక్ చేసి పెట్టుకుంటుండమే ఇందుకు కారణం. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ)కు గత వేసవిలో సగటున రోజుకు హైదరాబాద్ నుంచి 20–22 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక బుకింగ్స్ వచ్చేవి. ఈ ఏడాది ఆ డిమాండ్ 40 వేల క్యూబిక్ మీటర్లు దాటిందని అధికారులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని టీఎస్ఎండీసీ కొత్తగా ఇసుక రీచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
తెలంగాణలో 36 ఇసుక రీచ్‌లు..
రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచ్‌లు సంఖ్య కొత్త వాటితో కలిపి 36కి చేరుకున్నాయి. ఇందులో 90 శాతానికి పైగా ఇసుక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే ఉన్నాయి. అక్కడి నుంచి హైదరాబాద్‌కు దాదాపు 300 కి.మీ. దూరం. మూసీ నదిలో ఇటీవల ప్రారంభమైన ఇటుకలపాడు రీచ్ 150 కిలోమీటర్ల లోపే ఉంటుంది. నల్లగొండ జిల్లా ఇటుకలపాడు, వంగమర్తిలో ఒక్కో ఇసుక రీచ్‌లు కొద్ది రోజుల క్రితమే మొదలవ్వగా.. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో మరో రెండింట్లో ఇసుక తవ్వకాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. వీటిలో మూడింటిని కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం కేటాయించారు. ఇటుకలపాడు రీచ్‌ను సాధారణ అవసరాలకు కేటాయించారు. కొత్త ఇసుక రీచ్‌లు మూసీ నదిలో ఉన్నాయి.
4 సంస్థలతో ఒప్పందం..
కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఇసుక రీచ్‌లలో తవ్వకాలు చేసి, స్టాక్ యార్డులకు పంపేందుకు నాలుగు సంస్థలతో టీఎస్ఎండీసీ ఒప్పందం చేసుకుంది. ఇటుకలపాడు వద్ద మూసీ నుంచి 4.92 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తీయనున్నారు. వంగమర్తిలో 2.78 లక్షలు, జాజిరెడ్డిగూడెంలో 17 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులోకి రానుంది. ఇటుకలపాడులో తవ్వే ఇసుకలో 200 క్యూబిక్ మీటర్లు నల్లగొండ జిల్లా వాసులకు, 1000 క్యూబిక్ మీటర్ల ఇసుకను ఇతర జిల్లాల వారికి టీఎస్ఎండీసీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతుంది.