Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

ఆస్తి పన్ను రూ.452 కోట్లు

తెలంగాణ ఖజానా పెట్టే ఆస్తి పన్నుతో నిండిపోయింది. 2018–19 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా రూ.452.71 కోట్ల ఇంటి పన్నులు వసూళ్లయ్యాయి. ఇది క్రితం ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 38.01 శాతం వృద్ధి. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను అడ్వాన్స్‌గా చెల్లిస్తే 5 శాతం రాయితీని ప్రకటించడంతో పన్ను చెల్లింపుదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. 5 శాతం రాయితీని 1,50,061 మంది వినియోగించుకున్నారు. తద్వారా రూ.70.80 కోట్ల రాబడి లభించింది.
ఎన్నికల కోడ్‌లోనూ భారీగా..
2018–19 ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి తెలంగాణలో ఎన్నికల కోడ్‌ ఉన్నప్పటికీ మున్సిపల్‌ విభాగం ప్రాపర్టీ ట్యాక్స్‌ వసూళ్లను చేసింది. అవగాహన కార్యక్రమాలు, రాయితీల వంటి వాటితో పన్ను చెల్లింపుదారులను ఆకట్టుకుంది. దీంతో 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.503.97 కోట్ల టార్గెట్‌లో రూ.452.71 కోట్లను రాబట్టింది. నిర్ధేశించిన లక్ష్యంలో 89 శాతం సాధించింది.
కొత్త పురపాలికల్లో నీరసం..
గతంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని కొన్ని గ్రామ పంచాయతీలను పురపాలికలుగా మార్చిన సంగతి తెలిసిందే. కానీ, కొత్త పురపాలికల్లో పన్ను వసూళ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. క్షేత్రస్థాయిలో అవగాహన లేకపోవడం, సిబ్బంది కొరత పన్ను మదింపుపై స్పష్టత లేకపోవటం వంటివి ఇందుకు కారణమని తెలిసింది. కొత్త మున్సిపాలిటీల్లో రూ.87.36 కోట్లు పన్ను లక్ష్యం ఉండగా.. రూ.72.43 కోట్లు వసూళ్లయ్యాయి. అదే పాత పురపాలక సంఘాల్లో రూ.416.60 కోట్లు కాగా.. రూ.380.28 కోట్లు వసూళ్లయ్యాయి.
100/100 మున్సిపాలిటీలివే..
రాష్ట్రంలోని 136 మున్సిపాలిటీల్లో 12 పురపాలికలు వంద శాతం ఆస్తిపన్ను వసూలు చేసి రికార్డు సృష్టించాయి. సూర్యాపేట, పీర్జాదిగూడ, కొత్తగూడెం, సిరిసిల్ల, మెదక్, షాద్‌నగర్, నర్సాపూర్, నాగారం, క్యాతన్‌పల్లి, శంషాబాద్, చెన్నూరు, వడ్డేపల్లి మున్సిపాలిటీలు నిర్దేశిత లక్ష్యాన్ని సంపూర్ణంగా అధిగమించాయి. ఇక 5 శాతం రాయితీతో ముందుగానే పన్ను రాబట్టిన మున్సిపాలిటీల జాబితాలో జహీరాబాద్, నిజాంపేట్, పీర్జాదిగూడ, గుండ్లపోచంపల్లి, బోడుప్పల్, మెట్‌పల్లి, దుండిగల్, వరంగల్, మహబూబాబాద్, వేములవాడ ఉన్నాయి.
చెల్లింపుదారుల సంఖ్య తగ్గినా..
ఇదిలా ఉంటే.. గడచిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పన్ను రాబడి పెరిగినప్పటికీ, చెల్లింపుదారుల సంఖ్యలో మాత్రం తగ్గుదల కనిపించింది. చెల్లింపుదారుల్లో రెండు శాతం వ్యత్యాసం ఉన్నప్పటికీ, పాత బకాయిలు, వాణిజ్య సముదాయాల నుంచి పన్నులు బాగా రాబట్టడంతో రాబడి గణనీయంగా పెరిగింది. 2017–18 సంవత్సరంలో 91.25 శాతం మేర పన్ను వసూళ్లు జరిగాయి. ఆ ఏడాది రూ.359.49 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.328.01 కోట్లు వసూలైంది. అంటే గడచిన ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 38.01 శాతం వృద్ధి.

Related Posts

Latest News Updates