బెంగళూరుకు చెందిన ఎంబసీ ప్రాపర్టీ డెవలప్మెంట్ కంపెనీ ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్‌లో 14 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇండియాబుల్స్ ప్రమోటర్ నుంచి ఈ వాటాను కొనుగోలు చేసినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్కి తెలిపింది. బ్లాక్‌స్టోన్ గ్రూప్‌తో కలిసి మూడు దశల లావాదేవీల్లో ఈ డీల్ జరిగింది. బ్లాక్‌స్టోన్ గ్రూప్– ఎంబసీ అలయెన్స్ సంయుక్తంగా కలిసి ఇండియాబుల్స్ గ్రూప్ చైర్మన్ సమీర్ గెహెలౌట్స్ నుంచి 39.5 శాతం వాటాను రూ.2,700 కోట్లకు కొనుగోలు చేశాయి. దీంతో ప్రస్తుతం గెహెలౌట్స్ వద్ద 24 శాతం వాటా ఉంది. దీన్ని వచ్చే 6–8 వారాల్లో కొనుగోలు చేసి.. కంపెనీ వాటాదారులకు ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇండియాబుల్స్ నుంచి 23.5 మిలియన్ చదరపు అడుగుల నివాస, 2.4 మిలియన్ చదరపు అడుగుల వాణిజ్య సముదాయాల ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. కాగా.. బ్లాక్‌స్టోన్ కంపెనీ దేశంలోని లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీలో వాటాను కొనుగోలు చేయడం ఇదే తొలిసారి.