హైదరాబాద్‌లో ఇల్లు కిరాయికి తీసుకోవాలంటే కనీసం 2–4 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి. అదే ఢిల్లీ, ముంబైలో 8 నెలలు, బెంగళూరు, చెన్నైలో అయితే ఏడాది వరకు అద్దెను అడ్వాన్స్‌గా తీసుకుంటున్నారు యజమానులు. దీంతో మధ్యతరగతికి, చిన్న స్థాయి ఉద్యోగులకు, విద్యార్థులకు మెట్రో నగరాల్లో అద్దె గృహాలను తీసుకోవటం భారంగా మారుతుంది. కానీ, ఇక నుంచి ఈ పప్పులేవీ ఉడకవ్. కేంద్రం నూతన రెంటల్ హౌజింగ్ పాలసీతో అద్దెదారుల అడ్వాన్స్ కష్టాలకు పరిష్కారం లభించనుంది. పాలసీలోని ప్రధాన అంశం అద్దె అడ్వాన్స్ 2 నెలలకు మించి ఉండకూడదనేది.
1.1 కోట్ల గృహాలు ఖాళీగా..
ప్రభుత్వ గణాంకాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో సుమారు 1.1 కోట్ల గృహాలు ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే అద్దెకు ఇస్తే కిరాయిదారులు తమ ఆస్తిని స్వాధీనం చేసుకోవ్చనే భయంతో గృహ యజమానులు భయపడుతున్నారు. తాజా చట్ట సవరణతో వీరందరికీ ఊరట కలగనుంది. పైగా ఇన్నాళ్లూ ఖాళీగా ఉన్న గృహాలు అద్దెకు పోవటమే కాకుండా పన్ను రూపంలో ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రత్యేక కోర్ట్, ట్రిబ్యునల్ ఏర్పాటు..
ఇంటి యజమాని, అద్దెదారుని మధ్య రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చేసుకోవాలి. ఒకవేళ అద్దెదారుడు ఇల్లు ఖాళీ చేయాలనుకుంటే కనీసం 3 నెలల ముందు యజమానికి తెలపాల్సి ఉంటుంది. ఒప్పందం మధ్య కాలంలో అద్దెను పెంచకూడదు. అగ్రిమెంట్ పూర్తయ్యాక అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేయాలి. యజమానికి, అద్దెదారునికి మధ్య ప్రయోజనాలను సమత్యులం చేయడానికి ఆయా రాష్ట్రాల్లో అధికారులను ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. అద్దెదారులు, యజమానుల ఫిర్యాదులు, అప్పీళ్లను పరిష్కరించడానికి ప్రత్యేకంగా రెంట్ కోర్ట్‌లను, ట్రిబ్యునల్స్‌లను ఏర్పాటు చేయాలని సూచించింది.