Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఇన్వెస్టర్లూ! గిఫ్ట్‌ సిటీకి వెళ్లొద్దాం రండి!!

మూలధన పన్నుల్లో మినహాయింపులు.. కంపెనీ లాభాల్లో డివెడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ రాయితీలు.. బ్యాంక్‌ రుణంలో వడ్డీ చెల్లింపులు.. సింపుల్‌గా చెప్పాలంటే వందకు వంద శాతం పన్ను రాయితీలు! ఇదీ క్లుప్తంగా గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ టెక్‌–సిటీ (గిఫ్ట్‌ సిటీ) ప్రయోజనాలు. ఇవి చాలవన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2.ఓ తొలి బడ్జెట్‌లో గిఫ్ట్‌ సిటీలో అంతర్జాతీయ ఆర్ధిక సేవల కేంద్రం (ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్‌– ఐఎఫ్‌ఎస్‌సీ) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు, ప్రవాసులు, సంస్థాగత పెట్టుబడిదారులు అందరి దృష్టి గిఫ్ట్‌ సిటీ మీద పడింది.
ఆర్ధిక మౌలిక అభివృద్ధే..
ఇప్పటివరకు దుబాయ్, సింగపూర్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాలకే పరిమిత ఐఎఫ్‌ఎస్‌సీలను మన దేశంలోని తీసుకొచ్చింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. దేశంలోని తొలి ఐఎఫ్‌ఎస్‌సీని గుజరాత్‌ గాంధీనగర్‌లోని గిఫ్ట్‌ సిటీలో ఏర్పాటు చేయనున్నారు. దేశంలో ప్రపంచ స్థాయి ఆర్ధిక, మౌలిక సదుపాయాలను అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉద్ధేశించినదే ఈ ఐఎఫ్‌ఎస్‌సీ. ఇందులో విదేశీ ఇన్వెస్టర్లకు, ప్రవాసులకు వంద శాతం పన్ను ప్రయోజనాలుంటాయి. పన్ను ప్రోత్సాహకాలతో భారత దేశాన్ని ప్రపంచం స్థాయికి తీసుకెళ్లినట్టవుతుంది. ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) స్వదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి రెడ్‌ కార్పెట్‌ పరిచినట్టవుతుంది.
వందకు వంద శాతం పన్నులుండవ్‌..
గిఫ్ట్‌ సిటీలోని ఇన్వెస్టర్లకు బోలెడు ప్రత్యక్ష పన్ను ప్రయోజనాలుంటాయి. ఇప్పటివరకు మూలధన పన్ను మినహాయింపులు అనేవి కొన్ని ఎంపిక చేసిన రుణాలు, డెరివేటీవ్స్‌ మాత్రమే ఉన్నాయి. కానీ, ప్రతిపాదిత ఐఎఫ్‌ఎస్‌సీలో అన్ని ఎక్స్‌ఛేంజ్‌ ఫండ్స్‌కు, ఈక్విటీలు, మ్యూచుఫల్‌ ఫండ్స్‌కు అన్నింటికీ వర్తిస్తుంది. దీంతో ఏ ట్రేడ్‌ ఉత్పత్తి మీద క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ ఉండదని విదేశీ ఇన్వెస్టర్లకు పూర్తి స్పష్టత ఉంటుంది. ఐఎఫ్‌ఎస్‌సీలోని కంపెనీలు చెల్లించే డివడెండ్ల మీద కూడా పన్ను మినహాయింపులను విస్తరించారు. 2017, ఏప్రిల్‌ 1 తర్వాతి నుంచి లాభాల్లోని డివడెండ్ల మీద ఎలాంటి పన్నులుండవు. కంపెనీలకు, మ్యూచువల్‌ ఫండ్లకు డివెడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ మినహాయింపులుంటాయి. కేటగిరీ–3 ఐఏఎఫ్‌ కింద వడ్డీ రాయితీ కూడా అందుతుంది.
పదేళ్లు పన్ను సెలవులు..
ఐఎఫ్‌ఎస్‌సీలోని వ్యాపార సంస్థలకు లాభాలపై 10 సంవత్సరాల పాటు వంద శాతం పన్ను సెలవులను ప్రకటించింది. ప్రస్తుతం లాభాలపై వంద శాతం పన్ను రాయితీ ఐదేళ్ల పాటు ఉంది. తర్వాత ఐదేళ్ల పాటు 50 శాతం రాయితీ ఉంది. వ్యాపారం ప్రారంభించిన 15 సంవత్సరాలలో వరుసగా ఏ 10 సంవత్సరాలకు అయినా సరే వంద శాతం పన్ను హాలిడేలను క్లెయిమ్‌ చేసుకునే వెసలుబాటును కల్పించారు.
ప్రత్యేక నియంత్రణ సంస్థ కూడా..
ప్రస్తుతం బ్యాంకింగ్, క్యాపిటల్‌ మార్కెట్స్, బీమా రంగాలను ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్‌డీఏఐ వంటి నియంత్రణ సంస్థలున్నాయి. వీటి అన్నింటి స్థానంలో కొత్తగా ఏకీకృత ఐఎఫ్‌ఎస్‌సీ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. వచ్చే కొన్నేళ్లలో దేశ ఆర్ధిక వ్యవస్థకు ఐఎఫ్‌ఎస్‌సీ నుంచి 1 ట్రిలియన్‌ డాలర్లను అందించాలన్నది లక్ష్యం.
గిఫ్ట్‌ సిటీ గురించి క్లుప్తంగా..
గుజరాత్‌లోని సబర్మతి నది వెనక భాగంలో ఉంటుంది. గాంధీనగర్‌ విమానాశ్రయం నుంచి 12 కి.మీ. దూరంలో ఉంటుంది. గిఫ్ట్‌ సిటీ మాస్టర్‌ ప్లాన్‌ 886 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 67 శాతం స్థలం కమర్షియల్‌ కోసం, 22 శాతం నివాసాల కోసం, 11 శాతం సోషల్‌ అవసరాల కోసం కేటాయించారు. 62,000,000 చ.అ. వాణిజ్య స్థలంలో 2,000,000 చ.అ. స్థలం ఆపరేషనల్‌లో ఉంది. ఇప్పటివరకు రూ.10,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సుమారు 200ల కంపెనీలు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. సుమారు 7,500 మంది ఉద్యోగులుంటారు. ఈస్ట్‌ చైనా ఆర్కిటెక్చరల్‌ డిజైన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఈసీఏడీఐ) గిఫ్ట్‌ సిటీని ప్లాన్‌ చేసింది.

Related Posts

Latest News Updates