Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

ఇల్లు అమ్మేటప్పుడు ఎక్కువ ధర రావాలా నాయనా?

కొనేటప్పుడు తక్కువ ధరలో రావాలి.. అమ్మేటప్పుడు మాత్రం ఎక్కువ రేటు రావాలని కోరుకునేది ఒక్క ప్రాపర్టీ విషయంలోనే. కొంచెం ప్రణాళిక, మరికొంచెం నేరుతో కాసింత ఖర్చు పెడితే చాలు ప్రతికూల సమయంలోనూ స్థిరాస్తి అమ్మేయవచ్చు.
విలువ పెరిగేది రెండు అంశాలతోనే..
ఇంటి అంతిమ విలువ రెండు రకాలుగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం నివసించడానికి సౌకర్యాలన్నీ ఉన్నాయా? ఒకవేళ భవిష్యత్తులో ఇల్లు అమ్మాలనుకుంటే మంచి ధర వస్తుందా? ఈ రెండు అంశాలు ముఖ్యం. ఉదాహరణకు చేరువలో షాపింగ్‌ మాళ్లు లేదా దుకాణాలు ఉన్నాయా? స్కూళ్లు, ఆసుపత్రులు, రవాణా సదుపాయాలు వంటివి ఉన్నాయా లేదా అనేవి చూడాల్సిందే. చుట్టుపక్కల వాళ్లు స్నేహపూర్వకంగా ఉంటేనే ప్రశాంతంగా నివసించొచ్చు. కొత్తగా పెళ్లయిన జంటలకు స్కూళ్ల అవసరముండదు కాబట్టి వీరు ఇల్లు కొనే ముందు ఈ అంశం గురించి పట్టించుకోరు. కాకపోతే ఇంటిని అమ్మాలనుకుంటే మాత్రం ఇదే కీలకంగా మారుతుందన్న విషయం మరిచిపోవద్దు. ప్రజా రవాణా వ్యవస్థ, పోస్టల్‌ సదుపాయాలూ కీలకమే.
సౌకర్యాలే ముఖ్యం కాదు..
అయితే ఇల్లు కొనే ప్రతి ఒక్కరూ తమ సౌకర్యాల్నే చూసుకోకూడదు. భవిష్యత్తు అవసరాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కారు లేదా బైకు ఉన్నవారికి ప్రజా రవాణా వ్యవస్థ అవసరం ఉండకపోవచ్చు. ఈ–మెయిళ్లు, కొరియర్ల యుగంలో పోస్టాఫీసులు అనవసరం కావచ్చు. ఇవే అంశాలు ఇతరులకు ముఖ్యమవుతాయని గుర్తుంచుకోండి. ఇంటిని అమ్మేటప్పుడు కీలకంగా మారతాయి. చేరువలోనే షాపింగ్‌ చేసుకోవడానికి అవకాశముందనుకోండి.. వారాంతపు రోజుల్లో బయటికి షికారు వెళ్లడానికి ఆసక్తిని చూపకపోవచ్చు. కానీ, భవిష్యత్తులో ఇల్లు కొనేవారికి ఇవే కీలకమవుతాయి. ఇలాంటి అంశాల ఆధారంగా ఇంటి అంతిమ విలువను లెక్కగడతారని ప్రతి ఒక్కరూ తప్పక గుర్తుంచుకోవాలి.
చిక్కులుండొద్దు..
స్థిరాస్తికి ఎన్ని అనుకూలతలు ఉన్నా ఓ విషయంలో మాత్రం చిన్నపాటి తేడా ఉన్న కొనుగోలుదారులు ముందుకురారు. అదే న్యాయపరమైన అంశం. మీరు విక్రయించాలనకున్న స్థిరాస్తికి సంబంధించిన న్యాయపరమైన అంశాల్ని కొనుగోలుదారులకు స్పష్టంగా వివరించాలి. అతనికేమైనా సందేహాలుంటే ఓపిగ్గా నివృత్తి చేయాలి. యాజమాన్య హక్కుల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని తేలాకే కొనుగోలుదారుడు ముందగుగు వేస్తాడని గుర్తుంచుకోండి.
ప్రాంతం కూడా ముఖ్యమే..
మన ఇంటికి అధిక ధర రావాలంటే అది ఉన్న ప్రాంతమూ ముఖ్యమే. ఇంట్లోని వసతులను మార్చినట్టుగా ప్రాంతాన్ని మార్చలేమనుకోండి. కాకపోతే మన ఇంటి నిర్మాణం ఎంత అభివృద్ధి చెంది ఉంటుందో ఆ ప్రాంతం కూడా అంతే వృద్ధి చెంది ఉంటుందనేది మర్చిపోవద్దు. అంటే ఇంట్లోని వసతులకే కాదు ఇంటికి దగ్గర్లో పాఠశాలలు, ఆసుపత్రులు, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాళ్లు ఉండాలన్నమాట. అలాగే ఆ ఇంటికొచ్చేందుకు లిఫ్ట్, పార్కింగ్‌ వంటి వసతులతో పాటుగా అడ్రస్‌ సులువుగా అర్థమయ్యేలా ల్యాండ్‌మార్క్, ఇంటి నుంచి మెయిన్‌ రోడ్డుకు వెళ్లేందుకు అనువైన రోడ్డు ఉండాలి.
నిర్వహణతోనే రెట్టింపు విలువ..
గేటెడ్‌ కమ్యూనిటీల్లో పిల్లలకు, పెద్దలకు ప్రత్యేకంగా పార్కులు, ఆట స్థలాలు, స్విమ్మింగ్‌ పూల్, జిమ్‌ వంటి ఆధునిక సదుపాయాలు కల్పించగానే సరిపోదు. వాటిని పక్కాగా నిర్వహించే సామర్థ్యముండాలి. అప్పుడే ఇంటి విలువ రెట్టింపవుతుంది. అందుకే సొసైటీ మెంబర్లు సక్రమంగా ఉండాలి. ప్రతి పైస ఖర్చు లెక్కుండాలి. ప్రతి ఫ్లాట్‌ యజమానులతో స్నేహపూర్వకంగా మెలగాలి. విద్యుత్, డ్రైనేజీ, మంచినీటి, లిఫ్టు వంటి మౌలిక వసతుల నిర్వహణకు ప్రత్యేకంగా ఉద్యోగులుండాలి. అప్పుడే ఆ గృహ సముదాయం బాగుంటుంది. రిపేర్ల విషయంలో నాణ్యమైన వస్తువులనే వినియోగించాలి. ఇంటి విలువ అనేది కేవలం ఫ్లాట్‌కో.. ప్లాట్‌కో పరిమితం కాదు.. అందులోని సౌకర్యాలు, నిర్వహణతో కలిపుంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈమధ్య కాలంలో వైఫై, జనరేటర్, హౌజ్‌ కీపింగ్‌ వంటి వసతులూ ఉంటేనే ధర ఎక్కువ పలుకుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి.  ఫుల్లీ ఫర్నీచర్, సెమీ ఫర్నీచర్‌ ఫ్లాట్లకూ ఇంకాస్త ఎక్కువే రేటొస్తుంది కూడా.

Related Posts

Latest News Updates