లైట్ ఎమిట్టింగ్ డియోడ్ (ఎల్ఈడీ) బల్బులు సురక్షితమైనవి కావు. మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్రాండ్లలో సగం సురక్షితమైనవి కావని, చట్టవిరుద్ధంగా తయారవుతున్నాయని నీల్సన్ సర్వే తెలిపింది. 8 ప్రధాన నగరాల్లోని 400లకు పైగా రిటైల్ ఔట్లెట్లలో నీల్సన్ పరిశోధన చేసింది.
బల్బులు 47 శాతం..
ఎల్ఈడీ బల్బులు, డౌన్లైటర్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సూచించిన వినియోగదారుల భద్రత ప్రమాణాలను అధిగమించాయని అధ్యయనంలో తేలింది. ఎల్ఈడీ బల్బ్ బ్రాండ్లలో 47 శాతం, డౌన్లైటర్స్ బ్రాండ్లలో 52 శాతం ప్రభుత్వ భద్రత ప్రమాణాలకు అనుగుణగా లేవని తెలిపింది.
వెలుతురు లేని లైట్లు..
హైదరాబాద్, న్యూఢిల్లీ, ముంబై, కోల్కత్తా, చెన్నై, దుర్గాపూర్, అహ్మదాబాద్ నగరాల్లో సర్వే నిర్వహించింది. కాగా.. హైదరాబాద్లో అత్యధికంగా 57 శాతం బ్రాండ్లు బీఎస్ఐ ప్రమాణాలను పాటించని బల్బులున్నాయి. ఎల్ఈడీ బల్బులు, డౌన్లైటర్లు తక్కువ కాంతిని కలిగి ఉన్నాయని సర్వే తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఎల్ఈడీ మార్కెట్ రూ.11,400 కోట్లుగా ఉందని ఎలక్ట్రిక్ ల్యాంప్ అండ్ కాంపోనెంట్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజు బిస్తా తెలిపారు.
చైనా నుంచి దిగుమతి..
చైనా నుంచి చీప్ ముడి పదార్థాలను, వస్తువులను దిగుమతి చేసుకొని స్థానికంగా తయారు చేస్తున్నారని, ఆయా ఎల్ఈడీ బ్రాండ్ల చట్ట విరుద్ధ తయారీ కారణంగా పన్ను రూపంలో ప్రభుత్వానికి సమకూరే ఆదాయానికి కూడా గండి పడిందని తెలిపింది.