ఆంధ్రప్రదేశ్ మౌలిక రంగం పీకల్లోతు కష్టాల్లో పడింది. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే దీనికి బీజం పడింది. గత తెలుగు దేశం ప్రభుత్వ హాయంలో ఏపీలో జరిగిన కాంట్రాక్ట్స్ అన్నీ పునఃసమీక్ష నిర్వహించి, అవసరమైతే రద్దు చేస్తామని ప్రకటించడమే ఇందుకు కారణమని తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన ఇన్ఫ్రా కంపెనీ ఎన్సీసీ అర్బన్.. కాంట్రాక్ట్స్ను రద్దు చేస్తే తమకు రూ.6100 కోట్ల నష్టం వాటిల్లుతుందని బీఎస్ఈకి తెలపడమే ప్రత్యక్ష ఉదాహరణ.
లక్ష కోట్ల వర్క్స్ కాంట్రాక్ట్స్
ఏపీలో ఎన్సీసీ, ఎల్ అండ్ టీ, మేఘా ఇంజనీరింగ్, జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంజనీరింగ్ వంటి కంపెనీలు ప్రభుత్వంతో వర్క్ కాంట్రాక్ట్స్ ఒప్పందం చేసుకున్నాయి. పంచాయతీ, ఆర్ అండ్ బీ, మున్సిపాలిటీ, ఇరిగేషన్, హౌజింగ్ బోర్డ్, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) వంటి అన్ని విభాగాల్లో కలిపి సుమారు లక్ష కోట్ల పైగానే వర్క్స్ కాంట్రాక్ట్స్ ఉంటాయని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) అంచనా వేసింది. విభాగాల వారీగా చూస్తే.. సీఆర్డీఏ 30 వేల కోట్లు, ఆర్ అండ్ బీలో 4 వేల కోట్లు, పంచాయతీరాజ్‌లో 6 వేల కోట్లు, మున్సిపాలిటీలో 10 వేల కోట్లు, వాటర్ వర్క్స్‌లో 4 వేల కోట్లు, ఇరిగేషన్లో 50 వేల కోట్ల వరకు కాంట్రాక్ట్స్ ఉంటాయని బీఏఐ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ చైర్మన్ వల్లభనేని వెంకటేశ్వర్ అంచనా వేశారు.
వర్క్స్ కాంట్రాక్ట్ ఒప్పందాల్లో కొన్ని..
– ఎల్ అండ్ టీ 3.2 కి.మీ. మేర ఆరు లైన్ల బ్రిడ్జ్ నిర్మాణం. ఆర్ అండ్ బీ నుంచి ఆర్డర్ విలువ రూ.1,387 కోట్లు.
– ఎల్ఎన్టీఈసీసీకి వాటర్ వర్క్స్ నుంచి రూ.1281 కోట్లు, పవర్ డిస్ట్రిబ్యూషన్‌కు రూ.1000–2000 కోట్ల ఆర్డర్స్.
– జేఎస్‌డబ్ల్యూ గ్రూప్.. రామయపట్నం ఓడరేవులో జిట్టీ అండ్ స్లర్రీ పైప్‌లైన్ నిర్మాణం. ఆర్డర్ విలువ రూ.4500 కోట్లు.
– హౌజింగ్, వాటర్ రిలేటెడ్ వర్క్స్ కోసం ఎన్సీసీ లిమిటెడ్ రూ.6100 కోట్ల ఆర్డర్లు.
– భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్‌లో అత్యధిక బిడ్డర్ జీఎంఆర్. దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ (పీపీపీ)ను చేపడుతోంది.
ప్రభావం స్వల్ప కాలమే..
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రామయపట్నం, బందర్ పోర్ట్స్, ముక్త్యాల లిఫ్ట్ ఇరిగేషన్, సీఆర్డీఏ డెవలప్మెంట్స్ వంటి ప్రాజెక్ట్‌ల మీద ప్రభావం చూపిస్తుందని, అయితే ఈ ప్రభావం అనేది స్వల్పకాలమే ఉంటుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం తిరిగి కాంట్రాక్ట్స్ పనులను పునరుద్దరించగానే నిర్వహణ పనులు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. కాకపోతే తిరిగి నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభమైతే ఇప్పటికంటే కార్మికులకు అదనంగా 5–8 శాతం వ్యయాన్ని భరించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు.
చిన్న కాంట్రాక్ట్ కంపెనీలు మూతే..
గతంలో టీడీపీ ప్రభుత్వ నుంచి రూ.25 కోట్ల లోపు బిల్ పేమెంట్ వర్క్స్ కాంట్రాక్ట్స్ పొందిన ఆర్డర్లను తక్షణమే నిలిపివేయాలని ఏపీ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం అన్ని ప్రభుత్వ విభాగాలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పెద్ద కంపెనీలకు ఇబ్బంది లేకపోయినా.. రూ.30–50 కోట్ల టర్నోవర్ చేసే చిన్న కంపెనీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, చిన్న కాంట్రాక్టర్లు కంపెనీలను మూసివేసే పరిస్థితి ఎదురవుతుందని బీఏఐ ఏపీ చాప్టర్ చైర్మన్ వల్లభనేని వెంకటేశ్వర్ తెలిపారు.
ఇతర రాష్ట్రాలకు కార్మికుల తరలింపు..
ఏపీ బీఏఐ చాప్టర్లో నమోదు అయిన కాంట్రాక్టర్లు సుమారు 700 మంది, రిజిస్టర్ కాని వాళ్లు 4 వేల మంది ఉంటారు. వీటిలో బడా కంపెనీలు 100 వరకుంటే.. రూ.50 కోట్ల లోపు కాంట్రాక్ట్స్ చేసేవాళ్లే కంపెనీలు 5 వేల వరకుంటాయి. ఏపీలో శ్రీకాకుళం, ఒంగోలు వంటి జిల్లాలతో పాటూ ఒరిస్సా, బెంగాల్, మధ్యప్రదేశ్, అస్సాం వంటి ఇతర రాష్ట్రాల నుంచి లక్ష సంఖ్యలో కార్మికులు పనిచేస్తుంటారు. ఇప్పటికే ఎల్ అండ్ టీ, మేఘా, ఎన్సీసీ వంటి కంపెనీలు ఏపీలోని కార్మికులను ఇతర రాష్ట్రాల్లోకి తరలించాయి. కానీ, ఏపీలో మాత్రమే కాంట్రాక్ట్ పనులను నిర్వహించే చిన్న కంపెనీలు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయాయి.
రియల్టీ మీద కూడా ప్రభావం..
జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్‌ల రద్దు నిర్ణయం మౌలిక రంగం మీద ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంటే.. నిర్మాణ రంగం మీద పరోక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. టైల్స్, సిమెంట్, స్టీల్ వంటి రియల్ ఎస్టేట్ అనుబంధ కంపెనీలకు నష్టాలు తప్పడం లేదు. కార్మికుల కొరతతో గృహ నిర్మాణ పనులు, వర్క్స్ కాంట్రాక్ట్స్ లేక నిర్మాణ సామగ్రి తయారీ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయని ఏపీకి చెందిన ప్రముఖ డెవలపర్ తెలిపారు.