Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

ఐటీతో రియల్‌ జోష్‌

దాదాపు ఐదేళ్ల నుంచి కార్పొరేట్లు, బహుళ జాతి సంస్థలు హైదరాబాద్‌ వైపు కన్నెత్తి చూడలేదు. ఇక్కడికొస్తే విమాన ఖర్చులూ దండగనే స్థాయికి దిగజారింది నగర మార్కెట్‌. అలాంటిది భాగ్యనగర స్థిరాస్తి మారెట్లో ఒక్కసారిగా పెను మార్పు కనిపిస్తుంది. దేశంలో 2015–16 తొలి త్రైమాసికంలో (జనవరి–మార్చి) వివిధ కార్యాలయాలు మొత్తం 8.71 మిలియన్‌ చ.అ. గ్రేడ్‌–ఏ ఆఫీసు స్థలాన్ని అద్దెకు తీసుకుంటే.. ఇందులో 8.12 మిలియన్‌ చ.అ. స్థలాన్ని ఐటీ, ఐటీఎస్‌ రంగాలే తీసుకున్నాయి. ఇందులో భాగ్యనగరం వాటా 15 శాతం మేర ఉందని కుష్‌మన్‌ వేక్‌ఫీల్డ్‌ నివేదిక చెబుతోంది.ప్రస్తుతం నగరంలో సుమారు 8 కోట్ల చ.అ. స్థలంలో ఐటీ సంస్థలు విస్తరించి ఉన్నాయి. ఏటా 40 లక్షల చ.అ. ఆఫీసు స్థలానికి గిరాకీ ఉంటుందని నిపుణులు అంచనా. స్థానిక రాజకీయాంశం, నిధుల లేమి కారణంగా కొన్నేళ్లుగా బెంగళూరు, చెన్నై, గుర్గావ్‌ వంటి నగరాల వైపు దృష్టిసారించిన అధిక శాతం ఐటీ కంపెనీలు.. ప్రస్తుతం హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ఏర్పాటు చేసేందుకు, విస్తరించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.– ఇటీవలే అమెరికా పర్యటనను పూర్తి చేసుకున్న మంత్రి కేటీఆర్‌.. 30కి పైగా ఐటీ, ఎలక్ట్రానిక్‌ సంస్థల ప్రతినిధులతో చర్చించానని.. అధిక శాతం కంపెనీలు భారీ పెట్టుబడులతో నగరంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తుండటం.. ఇతర మెట్రో నగరాలతో పోల్చితే ఇక్కడ ధరలూ తక్కువగా ఉండటంతో అధిక శాతం ఐటీ,ఐటీఈఎస్‌ కంపెనీలు నగరానికి క్యూ కడుతున్నాయని నిపుణుల అభిప్రాయం.– రూ.1,000 కోట్ల పెట్టుబడులతో గూగుల్‌.. అమెరికా తర్వాత అతి పెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. రూ.1,300 కోట్లతో డీఈషా–బ్లాక్‌ స్టోన్‌ సంస్థలు పరిశోధన–అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రాన్ని కూడా నగరంలోనే నెలకొల్పనున్నాయి. మరోవైపు నగరంలోని మైక్రోసాఫ్ట్‌ సంస్థ తన కార్యాలయాన్ని విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది కూడా.– ఇటీవలే డెలాయిట్‌ సంస్థ 24 లక్షల చ.అ., నోవార్టిస్‌ సంస్థ 11 లక్షల చ.అ. స్థలాన్ని అద్దెకు తీసుకున్నాయి. అమెజాన్‌ అతిపెద్ద ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను కూడా ఇక్కడే ఏర్పాటు చేయనుంది. హెచ్‌ఎస్‌బీసీ, క్యాప్‌ జెమినీ వంటివి చెరో 10 లక్షల చ.అ. స్థలాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయని ఓ సర్వే సంస్థ చెబుతోంది. కెనడాకు చెందిన ఓ బడా కంపెనీ నగర నిర్మాణ సంస్థతో కలిసి దాదాపు 20 లక్షల చ.అ.ల్లో నిర్మాణ సముదాయాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది కూడా.– మాదాపూర్, కొండాపూర్, హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, ఆదిభట్ల, పోచారం తదితర ఐటీ కారిడార్లలోని ఆఫీసు స్థలానికి మంచి గిరాకీ ఉంది. ఇందులో మాదాపూర్, హైటెక్‌ సిటీ, కొండాపూర్‌ ప్రాంతాల్లోని ఐటీ స్థలం నిర్మాణ దశలోనే లావాదేవీలు పూర్తవుతున్నాయి. ఇక్కడి ఐటీ, ఎస్‌ఈజెడ్‌ స్థలాల్లో అద్దెలూ స్థిరంగా ఉన్నాయి. అద్దె మహా అయితే రెండు నుంచి మూడు శాతం మాత్రమే పెరిగింది.– సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్‌ అయిన బేగంపేట్, పంజగుట్ట, సోమాజిగూడ, బంజారాహిల్స్‌ లోని పలు ప్రాంతాల్లో ఆఫీసు స్థలాల లావాదేవీలు కాస్త మందకొడిగానే ఉన్నాయి. అద్దెలు కూడా స్థిరంగానే ఉన్నాయి.

Related Posts

Latest News Updates