ఇక నుంచి తెలంగాణలో ప్రాపర్టీల రిజిస్ట్రేషన్ అత్యంత సులువు కానుంది. స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు ఇకపై తమ దస్తావేజుల కోసం డాక్యుమెంట్ రైటర్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ సిద్ధం కాగానే కొనుగోలుదారుడి మొబైల్కు వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఓటీపీ నంబర్ చెప్పి సంబంధిత వ్యక్తులు స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి నేరుగా డాక్యుమెంట్ తీసుకోవచ్చు.
డాక్యుమెంట్ రైటర్ల మీదే భారం..
వాస్తవానికి ఆన్లైన్లో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం అందుబాటులో ఉన్నా ఎక్కువశాతం మంది ఇప్పటికీ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లనే ఆశ్రయిస్తున్నారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే.. రిజిస్ట్రేషన్ అనంతరం నాలుగు లేదా వారం రోజులకు కానీ స్కాన్ అయిన డాక్యుమెంట్ తిరిగి రావడం లేదు. దానిపై కూడా సరైన సమాచారం లేక కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిని నివారించడానికి ఉన్నతాధికారులు ఎస్సెమ్మెస్ ఓటీపీని అందుబాటులోకి తెచ్చారు.
141 సబ్ రిజిస్ట్రార్ ఆపీసుల్లో సేవలు..
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాగానే సదరు వ్యక్తుల ఫోన్కు ఎస్సెమ్మెస్ వచ్చేలా ఏర్పాటు చేశారు. తాజాగా రిటర్న్ డాక్యుమెంట్ కోసం కూడా ఎస్సెమ్మెస్ ఇస్తున్నారు. రెండు రోజులుగా ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నారు. దీంతో ఆస్తి కొనుగోలుదారులు డాక్యుమెంట్ రైటర్లపై ఆధారపడకుండా ఓటీపీ నంబర్ చెప్పి సబ్ రిజిస్ట్రార్ వద్ద తమ దస్తావేజులను తీసుకోవచ్చని ఉన్నతాధికారులు తెలిపారు.