తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కొత్త చిక్కులొచ్చాయి. ఎర్రమంజిల్ ప్యాలెస్ స్థానంలో నూతన శాసన సభ నిర్మించాలని తలచిన కేసీఆర్‌కు నవాబ్ వారసులు అడ్డుపడ్డారు. 1960లో ఎకరం స్థలంలో నిర్మించిన ఆంధ్రా జూనియర్ స్టాఫ్ క్వార్టర్స్ స్థలానికి నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పేశారు.
106, 107 సర్వే నంబర్లు..
150 సంవత్సరాల పురాతన ఎర్రమంజిల్ స్థలంలో తెలంగాణ ప్రభుత్వం నూతన శాసన సభ నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇటీవలే భూమి పూజ కూడా నిర్వహించారు. వాస్తవానికి ఎర్రమంజిల్ ప్యాలెస్ 98 ఎకరాల్లో ఉండగా.. ఇందులో సర్వే నంబర్లు 106, 107ల్లోని 9 ఎకరాల స్థలాన్ని వివిధ ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకుంది. ఇందులో 1960లో ఎకరం విస్తీర్ణంలో నిర్మించిన ఆంధ్రా జూనియర్ స్టాఫ్ క్వార్టర్స్ నిర్మించారు. ఈ స్థలానికి తెలంగాణ ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించకుండా ప్యాలెస్‌కు భంగం కలిగించకూడదని నవాబ్ ఫకర్–ఉల్–ముల్క్ లీటల్ వారసుల అసోసియేషన్ సెక్రటరీ నవాబ్ షఫత్ అలీఖాన్ అన్నారు. అలాగే ప్యాలెస్ పక్కనే మిగిలిన 8 ఎకరాల ఓపెన్ ల్యాండ్‌ను ఫకర్–ఉల్–ముల్క్ బంధువులకు అప్పగించాలని లేదా మార్కెట్ రేటు ప్రకారం తగిన పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం ఎర్రమంజిల్‌లో స్థల రేటు వందల కోట్లుంటుంది.
ప్యాలెస్ స్థలం ఎలా తగ్గిందంటే:
ఎర్రమంజిల్ ప్యాలెస్ భూమి వివిధ దశల్లో ఎలా తగ్గిపోతూ వచ్చిందో ఫరక్–ఉల్–ముల్క్ ముని మనవడు షఫత్ వివరించారు. వాస్తవానికి ఎర్రమంజిల్ ప్యాలెస్ విస్తీర్ణం మొత్తం 98 ఎకరాలు. ఇందులో 36 ఎకరాలను 1951 జూన్ 25న ఫకర్–ఉల్–ముల్క్ బంధువు ప్రభుత్వానికి విక్రయించారు. ఆ తర్వాత 1956లో మిగిలిన 62 ఎకరాల్లో 19 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1958 మేలో అప్పటి కలెక్టర్ పరిహారాన్ని చెల్లించారు. ఖర్చులను మినహాయించగా.. మిగిలిన మొత్తాన్ని ఫకర్–ముల్క్ ఐదుగురు కుమారులకు పంచారని ఫషాత్ గుర్తు చేసుకున్నారు.
పబ్లిక్‌వర్క్స్ డిపార్ట్మెంట్..
మిగిలిన 43 ఎకరాల్లో 28 ఎకాలను ఫకర్–ఉల్–ముల్క్ తన ఐదుగురు కుమారులకు పంపిణీ చేశారు. మిగిలిన 15 ఎకరాల స్థలాన్ని కొంతకాలం ఎవరికీ పంపిణీ చేయకుండా అలాగే ఉంచారు. ఈ భూమిలో ఎక్కువ భాగం దీర్ఘకాలం పాటూ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వద్దే ఉండిపోయింది. మిగిలిన భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించారు. ఆ తర్వాత అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎకరం 21 గుంటల విస్తీర్ణాన్ని స్వాధీనం చేసుకొని.. ఈ స్థలంలో పీడబ్ల్యూడీ స్టాఫ్ క్వార్టర్స్‌ను నిర్మించింది.