కేసీఆర్ కలల సౌధం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో రోజుకో ఘరానా మోసం వెలుగు చూస్తోంది. 2 బీహెచ్‌కే గృహం ఇప్పిస్తామని సామాన్యుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న కేటుగాళ్లను మించిన సంఘటన ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో చోటు చేసుకుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఏకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో ఆహ్వాన పత్రిక ముద్రించేసి.. అమాయక ప్రజలను మోసం చేయడమే!
బీజేపీ నేత ప్రదీప్ కుమార్..
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–46లో తెలంగాణ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. దీన్ని అదనుగా చేసుకున్నాడు ఖైరతాబాద్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడు ఎం. ప్రదీప్‌కుమార్. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–2లోని ఇందిరానగర్‌లో నివసించే ప్రజలకు గాలం వేశాడు. ప్రభుత్వం ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టారని, వాటిని తనకున్న పరిచయాలతో తక్కువ ధరకే ఇప్పిస్తానంటూ 50 మంది వరకు అమాయకులను మభ్యపెట్టి ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశాడు.
ఆహ్వాన పత్రిక ముద్రణ..
2018 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన ఈ ఇళ్ల ప్రారంభోత్సవం కూడా ఉందని, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మాజీ మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేస్తారని ఓ ఆహ్వాన పత్రికను కూడా ముద్రించాడు. శ్రీ వెంకటేశ్వర విల్లాస్ పేరుతో ముద్రించి ఈ పత్రికలో తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన డబుల్ బెడ్ ఇళ్లు అంటూ పేర్కొన్నాడు. ప్రభుత్వం నిర్మించినవే కదా పైగా చెబుతున్నది మాజీ మంత్రులతో పరిచయం ఉన్న బీజేపీ నేత కదా అని చాలా మంది నమ్మారు. ఇదే అదనుగా ప్రదీప్ ఈ పత్రికలు చూపించి డబ్బులు దండుకున్నాడు.
తీరా వెళ్లి చూస్తే..
మోసపోయిన బాధితులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల స్థలానికి వెళ్లి చూసి ఖంగుతిన్నారు. అక్కడ రాళ్లు తప్పితే ఇళ్లు కనిపించలేదు. మోసపోయామని తెలుసుకొని నిందితుడి ఇంటికి వెళితే ఇళ్లు ఖాళీ చేసి పరారైనట్లు తేలింది. నిందితుడు గతంలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో చాలా మందిని మోసగించి నెల రోజులు జైలుకెళ్లాడు.