తెలంగాణ ప్రజల సొంతింటి కలను తీర్చడం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఫెయిల్ అయ్యాడు. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కేసీఆర్ 2 బీహెచ్కే నిర్మాణంలో విఫలమయ్యారు. వరుసగా రెండు సార్లు సీఎం కుర్చీ మీద కూర్చున్నా.. ప్రజలకు హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు.
తెలంగాణలోని పేదలకు 2.80 లక్షల 2 బీహెచ్కే గృహాలను నిర్మించి సొంతింటి కలను తీరుస్తామని 2014 ఎన్నికల ప్రచారంలో ప్రజలకు కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో టీఆర్ఎస్ గెలవడం, కేసీఆర్ సీఎం కూర్చీలో కూర్చోవటం.. ఐదేళ్లు పూర్తవ్వటం కూడా అయిపోయింది. మళ్లీ 2019 ఎన్నికలొచ్చాయి. మళ్లీ కేసీఆరే గెలిచాడు. వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠమెక్కాడు. అయినా నేటికీ కేసీఆర్ ఇచ్చిన హామీ 2.80 లక్షల గృహాల నిర్మాణంలో.. పూర్తి చేసింది కేవలం 22,525 గృహాలు మాత్రమే!
నిర్మాణంలో 1.79 లక్షల గృహాలు..
మొత్తం 2.80 లక్షల గృహాలను నిర్మించాల్సి ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం 1.99 లక్షల గృహాల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించింది. వీటిలో 1.79 లక్షల 2 బీహెచ్కే గృహాలు నిర్మాణంలో ఉన్నాయని తెలంగాణ హౌజింగ్ (2 బీహెచ్కే) ప్రాజెక్ట్ గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం 2 బీహెచ్కే నిర్మాణం కోసం రూ.5490 కోట్లు ఖర్చు చేసింది.
సిమెంట్, స్టీల్ ధరల పెరుగుదలే..
2 బీహెచ్కే నిర్మాణం కోసం సర్వే చేయటం, ప్రజలు ఎక్కడ నివాసముంటారు? నిర్మాణాల కోసం స్థలాలను గుర్తించడం, టెండర్లను పిలవటం, నిర్మాణ పనులు ప్రారంభమవ్వటం తదితర అంశాలకు కాస్త సమయం పడుతుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఉక్కు, సిమెంట్ ధరలు పెరుగుతుండటంతో కాంట్రాక్టర్లు నిర్మాణ పనులు చేపట్టేందుకు ముందుకు రావట్లేదని దీంతో ప్రాజెక్ట్లు ఆలస్యమవుతున్నాయని చెప్పారు.
వాస్తవానికి 22 లక్షల బీపీఎల్ కుటుంబాలు..
తొలిసారిగా కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. 2014 ఆగస్టులో ఇంటి ఇంటి సర్వే కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సర్వేలో తెలంగాణలో బీపీఎల్– దారిద్ర రేఖకు దిగువన 22 లక్షల కుటుంబాలు అద్దె గృహాల్లో నివాసం ఉంటున్నట్లు తేలింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం కేవలం 2.80 లక్షల 2 బీహెచ్కే గృహాలే మంజూరు చేసింది. కానీ, ఇందులో 10 శాతం గృహాల నిర్మాణం పూర్తి కాకపోవటం గమనార్హం. సొంతంగా భూమి ఉన్న వాళ్లు 2 బీహెచ్కే గృహాల కోసం ముందుకొస్తే రూ.5 లక్షల మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.