Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

కేసీఆర్‌ భూ పంపిణీకి చుక్కెదురు

తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌ జోష్‌.. కేసీఆర్‌కు తలనొప్పిగా మారింది. రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాల సాగు భూమిని పంపిణీ చేయాలని నిర్ణయించిన భూ పంపిణీ పథకం కష్టాల్లో పడటమే ఇందుకు కారణం. రాష్ట్ర వ్యాప్తంగా స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతుండడంతో.. భూ పంపిణీ పథకానికి భూమి లభ్యత కష్టంగా మారింది.
భూ పంపిణీ పథకాన్ని ముఖ్యమంతి కేసీఆర్‌ కరీంనగర్‌ జిల్లాలో ప్రారంభించారు. దళితులకు మూడు ఎకరాల వ్యవసాయ భూమిని అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. తొలుత ఒక్క మండలంతో ప్రారంభించి.. 500 మండలాలకు విస్తరిస్తామని హామీ ఇచ్చారు. భూ పంపిణీ పథకం కింద సారవంతమైన భూమిని కొనుగోలు చేయాలనే నిబంధన ఉంది. అదేవిధంగా ఆ భూమిలో భూగర్భ జలాల లభ్యత సంతృప్తికరంగా ఉండాలి. మట్టి నమూనాలు పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలి.
రియల్టీ జోష్‌తో భూమి దొరకట్లేదు..
భూ పంపిణీ కింద గరిష్టంగా ఎకరాకు రూ.7 లక్షలు చెల్లించాలని ప్రభుత్వం నిర్దేశించింది. కానీ ప్రస్తుతం ఈ ధరకు సారవంతమైన భూమి లభించడం అత్యంత కష్టంగా మారింది. రాష్ట్రంలో 90 శాతం ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో నిర్దేశిత ధరకు సారవంతమైన భూమిని కొనుగోలు చేయడం కష్టంగా మారింది. దీంతో భూపంపిణీ పథకం కింద భూమి కొనుగోలు పూర్తిగా నిలిచిపోయింది.
2018–19 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఒక్క ఎకరా భూమిని సైతం కొనుగోలు చేయలేదు. నిర్దేశిత ధరలో లభించకపోవడంతో చేసేదేం లేదని అధికారులు చెబుతున్నారు. 2019–20 వార్షిక సంవత్సరంలో కూడా భూ పంపిణీ పథకంలో పురోగతి లేదు. భూముల ధరలు అనుకూలంగా లేకపోవడంతో పథకాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలన్న అయోమయంలో ప్రభుత్వం పడిపోయింది.
అగ్రిమెంట్లు రద్దు చేసుకుంకుంటున్న రైతులు..
భూపంపిణీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 13,190 ఎకరాలను 5,185 మంది దళితులకు పంపిణీ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.564.16 కోట్లు ఖర్చు చేసింది. 2017–18 సంవత్సరంలో భూముల ధరలు తక్కువగా ఉండడంతో అప్పట్లో ఎస్సీ కార్పొరేషన్‌ పలువురు రైతులనుంచి భూముల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు 360 ఎకరాలను కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్‌ సైతం చేసుకుంది. కానీ ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయలేదు. దీంతో రైతులంతా మూకుమ్మడిగా అగ్రిమెంట్లను రద్దు చేస్తూ భూమిని అమ్మలేమంటూ తేల్చేశారు. 2018–19లో కూడా 800 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్లు చేసుకుంది. ఇందుకుగాను రూ.40 కోట్లు చెల్లించాల్సి ఉండగా… నిధులు విడుదల కాకపోవడంతో ఆ ఒప్పందాలు కూడా రద్దు అయ్యాయి.

Related Posts

Latest News Updates