రాష్ట్రంలో ఇల్లు లే ని నిరుపేదలకు సొంతిల్లు కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం 2 బీహెచ్‌కే పథకాన్ని ప్రారంభించింది. ఈ గృహాల నిర్మాణానికి వ్యయ భారం పెరుగుతుండటంతో ప్రీ–ఇంజనీరింగ్ (ప్రీ–ఫ్యాబ్)తో నిర్మించాలని నిర్ణయించింది. మేడ్చల్‌లోని దుండిగల్‌లో సుమారు 2 వేల గృహాలను ఉక్కుతోనే నిర్మిస్తోంది. సాధారణంగా 2 బీహెచ్‌కే ఇంటి నిర్మాణానికి రూ.7.50 లక్షలు ఖర్చవుతుంది. కానీ, ప్రీకాస్ట్తో ధర కాసింత తగ్గుతుందని.. అయితే ఇక్కడ ధర కంటే ముఖ్యమైంది నిర్మాణ సమయం కలిసొస్తుందని ప్రీ ఇంజనీర్డ్ పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.
ఫ్యాక్టరీలోనే ఇంటి నిర్మాణం..
గోడలు, శ్లాబ్, మెట్లు, బీమ్‌లు వంటి దాదాపు 95 శాతం ఇంటి నిర్మాణం ప్రీకాస్ట్ ఫ్యాక్టరీలోనే తయారు చేస్తారు. వాటిని తీసుకొచ్చి నిర్మాణ ప్రాంతంలో జోడిస్తారు. అంతే! సిమెంట్, ఇనుము వంటి సాధారణ పద్ధతిలో నిర్మించే ఇంటికి 2 ఏళ్ల సమయం పడుతుంది. కానీ, ప్రీకాస్ట్, మైవాన్ టెక్నాలజీతో అయితే 12 నెలల్లో పూర్తవుతుంది. ప్రీకాస్ట్లో శ్లాబ్, గోడలు, మెట్లు, లిఫ్ట్ వెల్ ప్రీకాస్ట్ ఇంజనీర్డ్తో ఉంటాయి. లోపలి గోడలు ఏఏసీ బ్లాక్స్‌తో నిర్మిస్తారు. దీని మందం 100 ఎంఎం (4 అంగుళాలు) ఉంటుంది. మైవాన్ టెక్నాలజీలో శ్లాబ్, వాల్, మెట్లు మాత్రమే కాంక్రీట్‌తో నిర్మిస్తారు. లోపలి గోడలు ఏఏసీ బ్లాక్స్‌తో ఉంటాయి. 4 రోజుల్లో ఒక అంతస్తు, 2 నెలల్లో స్ట్రక్చర్, 6 నెలల్లో 3 బ్లాక్స్ నిర్మాణం పూర్తవుతుంది. సిమెంట్ ఫ్లోరింగ్, రంగులు కూడా మిషన్‌తో వేస్తారు. దీంతో మందం, ఫినిష్ సరిగా వస్తుంది.
ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే..
బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాల్లో ఇప్పటికే ప్రీకాస్ట్ సాంకేతికతతో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ నారెళ్ల, ద్వారకా వంటి ప్రాంతాల్లో 50 వేల ఇళ్లను నిర్మించింది. ముంబైలో స్లమ్ రీహాబిలిటేషన్ కింద ఎల్అండ్టీ సంస్థ ప్రీకాస్ట్తో 22 అంతస్తుల భవనాన్ని నిర్మించింది. బెంగళూరులో టాటా ప్రాజెక్ట్స్ 30 లక్షల చ.అ.ల్లో 32 అంతస్తుల నిర్మాణాన్ని కేవలం 30 నెలల్లో పూర్తి చేసింది.