Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

కొత్త మున్సిపల్‌ చట్టంలో బీసీలకు అన్యాయం: కాంగ్రెస్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మున్సిపల్‌ చట్టం–2019పై విపక్ష పార్టీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చట్టంతో బీసీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని, బీసీల రాజకీయ భవిష్యత్తు మరింత ఆందోళనకరంగా మారుతుందని మండిపడ్డారు. శాసన మండలి సమావేశాల్లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం శాసనమండలిలో నూతన మున్సిపల్‌ చట్టం–2019ను మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం ఈ చట్టంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడారు. పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను భారీగా కుదించారని, దీంతో స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం బాగా తగ్గిందన్నారు. వెనుకబడిన తరగతులు రాజకీయంగా మరింత వెనుకబడ్డాయని మండిపడ్డారు. తాజాగా మున్సిపల్‌ యాక్టులోనూ బీసీ రిజర్వేషన్లు తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు చట్టబద్దత లేదన్నారు. బీసీ జనాబా, కులాల వారీగా వివరాలను బహిర్గతం చేయకపోవడంలో అంతర్యమేమిటన్నారు. జనాబా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఇంతలో మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటూ నూతన చట్టంపైనే మాట్లాడాలని, అసందర్భ చర్చకు అవకాశం లేదన్నారు. కొత్త మున్సిపల్‌ చట్టంలో బీసీ రిజర్వేషన్లు హరించేలా ఉన్న సెక్షన్లను తొలగించాలటూ వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో జీవన్‌రెడ్డి హాల్‌ నుంచి వాకౌట్‌ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ నూతన మున్సిపల్‌ చట్టంలో కొన్ని సవరణలు చేయాలని బీజేపీ తరపున ప్రభుత్వానికి సూచనలు చేశామని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. కొత్త చట్టంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, మున్సిపల్‌ కౌన్సిలర్లను డిస్మిస్‌ చేసే అధికారాన్ని కలెక్టర్లకు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు.
రాజధాని చుట్టూ ఏడు కార్పొరేషన్లు
పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని నగరం చుట్టూ కొత్తగా ఏడు మున్సిపల్‌ కాలర్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. పరిపాలన సౌలభ్యంతో పాటు మెరుగైన పట్టణ ప్రాణాళిక కోసం ఈ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 10 శాతం ఖాళీ జాగాను స్థానిక మున్సిపాలిటీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేసేలా నిబంధన విధించామన్నారు. మహానగరానికి తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి రిజర్వాయర్‌ నుంచి నీటిని నగరానికి తరలించేలా ఏర్పాట్లు చేచేస్తున్నామని మంత్రి శాసనమండలిలో సభ్యులకు వివరించారు. నూతన మున్సిపల్‌ చట్టం ఆమోదం తర్వాత మండలి చైర్మన్‌ సభను నిరవదికంగా వాయిదా వేశారు.

Related Posts

Latest News Updates