Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

కొత్త శాసన సభ, మండలి భవనాల నిర్మాణం

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా శాసన సభ (అసెంబ్లీ), శాసన మండలి (కౌన్సిల్‌) భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. ఎర్రమంజిల్‌లోని రోడ్లు మరియు భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) కార్యాలయం స్థానంలో కొత్తగా అసెంబ్లీ, కౌన్సిల్‌ భవనాలను నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. హుస్సేన్‌ సాగర్‌ సమీపంలో కొత్తగా తెలంగాణ సచివాలయ నిర్మాణానికి ఈ నెల 27న శంకుస్థాపన చేసిన రోజే.. ఆర్‌అండ్‌బీ ఆఫీస్‌ కూల్చివేతకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది.
ప్రముఖ ఆర్కిటెక్ట్‌కు డిజైన్స్‌ బాధ్యతలు..
ప్రస్తుతం పబ్లిక్‌ గార్డెన్‌కు సమీపంలో శాసన సభ, శాసన మండలి భవనాలున్నాయి. సచివాలయ డిజైన్స్‌ పనులను ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్‌ హఫీజ్‌ కాంట్రాక్టర్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. కొత్త అసెంబ్లీ, కౌన్సిల్‌ బిల్డింగ్స్‌ డిజైన్స్‌ రూపకల్పన బాధ్యతలను కూడా దేశంలోని ఓ ప్రముఖ ఆర్కిటెక్ట్‌కు అప్పగించినట్లు సమాచారం.
ఢిల్లీ పార్లమెంట్‌ కాంప్లెక్స్‌ తరహాలో..
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు కొత్త అసెంబ్లీ, కౌన్సిల్‌ భవనాల ఎలివేషన్స్‌ మీద ప్రత్యేక దృష్టిపెట్టారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఢిల్లీలోని పార్లమెంట్‌ కాంప్లెక్స్‌ తరహాలో తెలంగాణ శాసన సభ భవనాలను నిర్మించాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం. ప్రధాన ఈవెంట్స్, సమావేశాలు జరిగినప్పుడు శాసన సభ సభ్యులు (ఎమ్మెల్యేలు), శాసన మండలి సభ్యులు (ఎమ్మెల్సీలు) ఇద్దరూ కూర్చునేందుకు వీలుగా సెంట్రల్‌ హాల్‌ ఉండాలని కేసీఆర్‌ యోచన. అసెంబ్లీ, కౌన్సిల్‌ రెండు సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసగించాల్సి వచ్చినప్పుడు లేదా ముఖ్యమంత్రి కీలకమైన అంశాలు మీద చర్చలు, ప్రజెంటేషన్‌ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ సెంట్రల్‌ హాల్‌ ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుందని సీఎం అభిప్రాయం.
నాలుగు దశల్లో నిర్మాణ పనులు..
కొత్త అసెంబ్లీ, కౌన్సిల్‌ నిర్మాణంలో నాలుగు దశలుంటాయి. భవనాల డిజైన్స్‌ కాన్సెప్ట్, నిర్మాణ వ్యయం అంచనా, టెండర్ల ఆహ్వానం, నిర్మాణ పనుల ప్రారంభం.. ఈ నాలుగు దశలుంటాయని, వీటికి సుమారు 6 నెలల సమయం పడుతుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. టెండర్ల ఖరారు, అగ్రిమెంట్‌ పూర్తయ్యాక, కొత్త భవనాల నిర్మాణ పనులకు సుమారు ఏడాదిన్నర కాలం పడుతుందని పేర్కొన్నారు. తొలి దశలో రూ.100 కోట్ల నిర్మాణ వ్యయాన్ని వెచ్చించనున్నట్లు తెలిసింది.
హైకోర్ట్‌లో వ్యాజ్యం దాఖలు..
ఇదిలా ఉంటే ఎర్రమంజిల్‌ భవనం తెలంగాణ వారసత్వ సంపది అని, దీన్ని కూల్చివేయడం సరైంది కాదని హైకోర్ట్‌లో వ్యాజ్యం దాఖలైంది. ఈ భవనాలను కూల్చివేయడాన్ని అడ్డుకోవడంతో పాటూ వాటి పరిరక్షణకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన జె. శంకర్‌ అనే వ్యక్తి హైకోర్ట్‌లో పిల్‌ దాఖలు చేశారు.
ఎర్రమంజిల్‌ చరిత్ర ఇదే..
ఎర్రమంజిల్‌ హెరిటేజ్‌ భవనాన్ని 2.2 లక్షల చదరపు అడుగుల్లో 1870లో నవాబ్‌ సఫ్దార్‌ జంగ్‌ ముషీర్‌–ఉద్‌–దౌలా ఫక్హ్రిల్‌ ముల్క్‌ నిర్మించారు. ఇండో–యూరోపియన్‌ ఆర్కిటెక్ట్‌ బారోక్యూ ఈ భవనాన్ని రూపుదిద్దారు. ఇందులో 150 గదులుంటాయి. నవాబు కాలంలో ఈ భవనాన్ని బాంక్వెట్స్, రాయల్‌ ఈవెంట్ల కోసం వినియోగించేవాళ్లు. ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాక ఈ భవనాన్ని రికార్డ్‌ స్టోర్‌ హౌజ్‌గా వినియోగించారు. 1956 వరకూ దీన్ని పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించారు. ప్రస్తుతం ఈ భవనాన్ని ఇంజనీరింగ్‌ అండ్‌ చీఫ్, రహదారులు, భవనాల శాఖ, నీటి పారుదల శాఖ, కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ (ఐ అండ్‌ సీఏడీ) కార్యాలయాల కోసం వినియోగిస్తున్నారు.

Related Posts

Latest News Updates