పుష్కరకాలం క్రితం హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్స్ అంటే అబిడ్స్, అమీర్‌పేట, హిమాయత్‌నగర్ వంటి కొన్ని ప్రాంతాలు. ఆ తర్వాత బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలు చేరాయి. కానీ, ఇప్పుడు నగర రియల్టీలో బంగారు కొండలంటే ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్), దాని చుట్టూ ఉన్న సరిహద్దు ప్రాంతాలే!
గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలైన గండిపేట, శంకర్పల్లి, మహేశ్వరం, శంషాబాద్, మోకిలా, కోకాపేట, కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ వంటి ప్రాంతాలు రియల్టీ హాట్‌స్పాట్స్‌గా మారాయి. రియల్ ఎస్టేట్ సంస్థలు, పెట్టుబడిదారులకు ఈ ప్రాంతాల మీదే ఎక్కువ దృష్టిసారిస్తున్నారు. తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం గణాంకాల ప్రకారం.. 2017–18 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 2018–19 ఆర్ధిక సంవత్సరంలో ఈ ప్రాంతాల్లో 70–120 శాతం వృద్ధి రేటును సాధించాయి. ఏప్రిల్, మే నెలల్లో గండిపేట ప్రాంతంలో 100 శాతం వృద్ధి నమోదైతే… బంజారాహిల్స్‌లో కేవలం 13 శాతం వృద్ధి కనిపించింది.
బంగారు రహదారులు..
శంకర్పల్లి నుంచి ముత్తంగి రోడ్, శంకర్పల్లి నుంచి కోకాపేట రోడ్, కోకాపేట నుంచి ముత్తంగి రోడ్లు రియల్టీ పెట్టుబడుల్లో బంగారు రహదారులుగా మారాయి. ముంబై, పుణె, ఢిల్లీ వంటి ఉత్తరాది ప్రాంతాలకు చెందిన బడా రియల్ ఎస్టేట్ సంస్థలు, పెట్టుబడిదారులు ఔటర్ రింగ్ రోడ్డు, దాని సరిహద్దు ప్రాంతాల్లో భారీ స్థాయిలో స్థలాల మీద పెట్టుబడులు పెడుతున్నారని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగం తెలిపింది. ఓఆర్ఆర్, రీజినల్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్ కారణంగా కనెక్టివిటీ పెరిగిందని, అంతర్జాతీయ స్కూల్స్, ఆసుపత్రులు, రిక్రియేషన్ జోన్స్ కూడా ఉండటం వృద్ధికి కారణమని నిపుణులు తెలిపారు.