Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

గోపన్‌పల్లి కమ్యూనిటీ హాల్‌ కంచికే

గచ్చిబౌలి డివిజన్‌ గోపన్‌పల్లితండాలో చేపట్టిన కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం ఎప్పటికి పూర్తయితుందో ఎవరూ చెప్పలేక పోతున్నారు. అసంపూర్తి పనులు పూర్తి చేసేందుకు నిధుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంది. పేదలు వివిధ కార్యాలు నిర్వహించుకునేందుకు చేపట్టిన మల్టీపర్పస్‌ కమ్యూనిటీ హాల్‌ మూడున్నరేళ్లుగా కొనసాగుతూనే ఉండటంపై సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది.
రూ.1.7 కోట్ల వ్యయంతో..
పేద, మధ్య తరగతి ప్రజలు ఏదైనా శుభకార్యాలు నిర్వహించాలంటే ప్రస్తుత మార్కెట్‌లో కమ్యూనిటీ హాళ్ల ధరలు వారికి అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో గోపన్‌పల్లితండాలో రూ. 1.72 కోట్ల వ్యయంతో అన్ని సౌకర్యాలతో కూడిన మల్టీపర్పస్‌ కమ్యూనిటీ హాల్‌ను నిర్మించాలని శ్రీకారం చుట్టారు. 2015 అక్టోబర్‌ 29న అప్పటి రవాణా శాఖ మంత్రి డాక్టర్‌ పి.మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అది మొదలు ఆ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.
మూడున్నరేళ్లు గడిచినా..
కమ్యూనిటీ హాల్‌ పనులకు శంకుస్థాపన చేసే సమయంలో ఏడాదిన్నరలో పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయితే మూడున్నరేళ్లు దాటినా పూర్తి చేయకపోవడం గమనార్హం. పునాదులు మొదలు ఐరన్‌ పిల్లర్లతో గ్రౌండ్‌ఫ్లోర్, ఫస్ట్‌ఫ్లోర్‌లను మాత్రమే పూర్త చేశారు. ఇతర నిర్మాణాలు, చుట్టూ గోడలు, సౌకర్యాలను కల్పించకుండా వదిలేశారు. రెండున్నరేళ్లుగా ఆ పనులు ఆగినా పట్టించుకునేనాథుడే లేడు. అందులోనే అధికారులు వివిధ సమావేశాలను నిర్వహిస్తున్నారు తప్ప దీని నిర్మాణం పూర్తి చేయాలనే ఆలోచనే చేయడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఈ కమ్యూనిటీ హాల్‌ అందుబాటులోకి వస్తే కనీసం పదిహేను వేల మందికి వివిధ శుభకార్యాలను అతి తక్కువ ధరలో నిర్వహించుకునేందుకు వీలవుతుందనడం నిర్వివాదాంశం.
రెండేళ్ల క్రితం ప్రతిపాదించినా..
ఆగిన కమ్యూనిటీ హాల్‌ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. అయితే నిధుల మంజూరు మాత్రం నేటికీ కాలేదు. గ్రౌండ్, ఫస్ట్‌ ఫ్లోర్లను ఐరన్‌ పిల్లర్లతో నిర్మించడం.. పనులు పూర్తి కాకపోవడంతో ఐరన్‌ తుప్పుపట్టిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మల్టీపర్పస్‌ కమ్యూనిటీ హాల్‌లో పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకొని ప్రజలకు అందుబాటులోకి తేవాలని గోపన్‌పల్లి, గోపన్‌పల్లితండా, వీకర్‌సెక్షన్‌కాలనీ, ఎన్టీఆర్‌కాలనీ, తాజ్‌నగర్, సోఫాకాలనీ, గౌలిదొడ్డి, కేశవనగర్‌వాసులు కోరుతున్నారు.
పూర్తిచేయాల్సిన పనులివే…
కమ్యూనిటీ హాల్‌ చుట్టూ ప్రహరీ, గేటు
నిర్మాణం పూర్తయిన వరకు గ్రౌండ్‌ఫ్లోర్, ఫస్ట్‌ఫ్లోర్‌ల చుట్టూ గోడలు
కిచెన్‌షెడ్, మరుగుదొడ్లు, మూత్రశాలలు, స్నానపు గదులు
హాల్‌ నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలి.

Related Posts

Latest News Updates