రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అమల్లోకి వచ్చాక ముందస్తు అమ్మకాలకు (ప్రీ లాంచ్) చెక్ పడింది. ఎందుకంటే రెరాలో నమోదు చేయకుండా అమ్మకాలు జరిపినా, ప్రచారం చేసినా సరే జరిమానా ఉంది. దీంతో డెవలపర్లు గోప్యంగా విక్రయాలు చేపడుతున్నారు. ముందస్తుగా డబ్బు సమీకరించి.. ఆ తర్వాత ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.
ప్రీ లాంచ్‌లో నష్ట భయాలు ఎక్కువే..
కొనుగోలుదారులను ఆకర్షించేందుకు డెవలపర్లు సంధించే అస్త్రాల్లో ప్రధానమైంది ప్రీ లాంచ్ ఆఫర్. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన పోకడే ఇది. కాకపోతే విదేశాల్లో ప్రతి అంశాన్ని పక్కాగా పాటించాకే ముందస్తు పథకాల్ని ప్రవేశపెడతారు. కానీ, మన దేశంలో డెవలపర్లు ఒక అడుగు ముందుకేసి ఫ్లాట్ల ధరను ముందే నిర్ణయించి విక్రయిస్తుంటారు. ఆయా నివాస సముదాయానికి నిర్ణీత అనుమతులు రాకముందే అమ్ముతున్నారు. కొన్ని నిర్మాణ సంస్థలు ఆరంభించే ప్రీలాంచ్ పథకాల్లో నష్టభయం ఎక్కువే. ఎలాగంటారా? అనుమతులు ఆలస్యం కావొచ్చు. ఇంటికి సంబంధించిన ప్రణాళికలు మారొచ్చు. పరిస్థితులు మెరుగ్గా లేక ఏకంగా ప్రాజెక్టే రద్దు కావొచ్చు.
ముందే డెవలపర్ల చేతికి సొమ్ము..
ప్రీలాంచ్ ద్వారా డెవలపర్లకు ముందే కొంత సొమ్ము చేతికి అందుతుంది. దీంతో తక్షణమే ఆయా ప్రాజెక్ట్‌కు ముందుకు తీసుకెళ్లే వీలుంటుంది. అనుమతుల కోసమో లేదా నిర్మాణాన్ని మొదలుపెట్టడానికో సామ్ము ఉపయోగపడుతుంది. ముందస్తు అమ్మకాల ద్వారా బిల్డర్లు, డెవలపర్లు పది నుంచి పదిహేను శాతం వరకూ ఇళ్లను విక్రయిస్తుంటారు. కొందరు బిల్డర్లు తెలివిగా ఏం చేస్తారంటే.. మార్కెట్లో తమ కొత్త ప్రాజెక్టు తుది ధరను నిర్ణయించడం కోసమే ముందస్తు అమ్మకాలను ప్రకటిస్తుంటారు.
కొనుగోలుకు ముందు పరిశీలన అవసరం..
స్థలానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలు పక్కాగా ఉన్నాయా? లేవా? అనే అంశాన్ని నిర్ధారించాకే కొనుగోలుకు సిద్ధం కావాలి. నచ్చిన ప్రాంతం, సైజు, కోరుకున్న దిక్కు, తక్కువ ధర, పేరున్న బిల్డర్ అయితే కొనుగోలులో సందేహించాల్సిన అవసరం లేదు. సాధారణంగా నిర్మాణం పూర్తి కావడానికి మూడు నుంచి ఐదేళ్లు పడుతుంది. కాబట్టి ఈ లోపు ధర పెరుగుతుంది. దీంతో చక్కటి లాభాల్ని అందుకోవచ్చు.
చైనాలో నో ప్రీలాంచ్..
చైనాలో ముందస్తు అమ్మకాల సంప్రదాయం లేదు. అక్కడి డెవలపర్లకు నిధుల సమస్య ఉండదు. ప్రభుత్వమే భూమిని సేకరించి, డెవలపర్లకు స్థలాన్ని విక్రయిస్తుంది. స్థల యాజమాన్య హక్కుల విషయంలో సమస్యలుండవు కాబట్టి రుణాలు విరివిగా లభిస్తాయి. ఇక్కడ డెవలపర్లే అన్నీ చేసుకోవాలి. న్యాయపరమైన అంశమైనా, నిర్మాణంలో ఆలస్యమైనా బాధ్యత బిల్డర్లదే. అలా కాకుండా చైనా తరహాలో నిర్మాణ సంస్థలకు సులువుగా నిధులు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.