ఇల్లు అందంగా కనిపించాలంటే రంగులు వేయటం మనకు తెలిసిందే. ఇంటి బయటే కాకుండా ఇంట్లో కూడా అందం ద్విగుణీకృతం కావాలంటే? విదేశాల నుంచి గ్రానైట్స్, మార్బుల్స్ వంటివి దిగుమతి చేసుకొని ఇంట్లో వేసుకోవాలి. కానీ, త్వరలోనే దిగుమతి చేసుకునే అవసరం లేదు. నిజం చెప్పాలంటే అసలు గ్రానైట్, మార్బుల్స్ అవసమే లేదండోయ్! ఎందుకంటే గ్రానైట్, మార్బుల్స్లను పోలినా పెయింట్స్ రానున్నాయి మరి! హైదరాబాద్‌కు చెందిన ఫార్చూన్ పెయింట్స్ ప్రై.లి. (టెక్నో పెయింట్స్) గ్రానైట్, మార్బుల్ టెక్చర్ పెయింట్స్ మీద పరిశోధనలు చేస్తోంది.
ప్రస్తుతం టెక్నో పెయింట్స్‌కు 25 వేల చ.అ.ల్లో మూడు తయారీ కేంద్రాలున్నాయి. హైదరాబాద్‌లోని కేపీహెచ్బీలో 15 వేల చ.అ.ల్లో రెండు, గుంటూరులోని నడికుడలో 10 వేల చ.అ.ల్లో మరొక తయారీ కేంద్రం ఉంది. మూడింట్లో కలిపి సుమారు 150 మంది ఉద్యోగులుంటారు. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 20 వేల మెట్రిక్ టన్నులు. రూ.2.5 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌లో మరొక ప్లాంట్, ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఫార్చూన్ గ్రూప్ ఎండీ ఆకూరి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ జూన్ 10న ప్రశాంత్ నగర్లో 8 వేల చ.అ.ల్లో ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నామని, ఇందులో సుమారు 50 మంది ఉద్యోగులుంటారని పేర్కొన్నారు.
ఏపీఎస్ రీసెర్చ్ అండ్ మీడియా అవార్డు..
ఏపీఎస్ రీసెర్చ్ అండ్ మీడియా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ విభాగం కింద 2019 సంవత్సరానికి ఫార్చూన్ పెయింట్స్ ప్రై.లి.కు క్వాలిటీ మ్యానుఫాక్చరింగ్ అవార్డు దక్కింది. ఫార్చూన్ గ్రూప్‌నకు ఫార్చూన్ పెయింట్స్ ప్రై.లి., ఫినెట్రీ యూపీవీసీ ప్రై.లి., ఏఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, టెక్నో ట్రేడర్స్ కంపెనీలున్నాయి.
రూ.100 కోట్ల టర్నోవర్..
మా గ్రూప్ టర్నోవర్ గత ఆర్ధిక సంవత్సరంలో రూ.100 కోట్లు. ఇందులో పెయింట్ల విభాగం రూ.70 కోట్లుగా ఉంటుంది. మా మొత్తం ఆదాయంలో 40 శాతం వాటా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉంటుంది. గత ఐదేళ్ల నుంచి 50 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం. ఇప్పటివరకు 600లకు పైగా ప్రాజెక్ట్‌లకు పెయింటింగ్‌ను పూర్తి చేశాం. ఆస్ట్రేలియా, యూరప్ వంటి దేశాల నుంచి ముడి సరకులను దిగుమతి చేసుకొని, పెయింట్స్, సొల్యూషన్స్‌ను తయారు చేస్తుంటాం.