ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు గత నాలుగు సంవత్సరాలుగా నివాసం ఉన్నది ఎక్కడో తెలుసా? అక్రమ నిర్మాణంలో! గుంటూరు అండవల్లిలోని కృష్ణానది తీరాన నిర్మించిన అక్రమ కట్టడాన్ని నివాసంగా మార్చుకున్నారు. ఏపీ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి విజయవాడకు మారిన తర్వాత 2016 నుంచి చంద్రబాబు ఈ భవనమే అధికారిక నివాసంగా మారింది.
రివర్ బెడ్లో నిర్మాణం..
నదీ పరిరక్షణ చట్టం ప్రకారం.. నదికి 500 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. కానీ, చంద్రబాబు అధికారిక నివాసం కృష్ణా నది రివర్ బెడ్లో అక్రమంగా నిర్మించారని మంగళగిరి శాసనసభ సభ్యులు (ఎమ్మెల్యే), ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీసీఆర్డీఏ) చైర్మన్ ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే) ఆరోపించారు.
ఈ భవనం ఓ పారిశ్రామికవేత్తది..
కృష్ణా నది తీరాన నిర్మించిన అక్రమ కట్టడాలపై గతంలో రామకృష్ణా రెడ్డి హైకోర్ట్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇన్నాళ్లు చంద్రబాబు అక్రమంగా నివాసం ఉన్న భవనం ఒక బడా పారిశ్రామికవేత్తది. దీన్ని గత రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నివాసంగా లీజుకు తీసుకుంది. నదీ పరరక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని, చట్టం ప్రకారం అక్రమ కట్టడాలన్నీ ఖాళీ చేయించి కూల్చేస్తామని, అందులో చంద్రబాబు నివాసం కూడా ఉంటుందని’’ తెలిపారు.
చంద్రబాబుతో సహా 78 అక్రమ నిర్మాణాలు..
చంద్రబాబు నివాసం ఉంటున్న ప్రజావేదిక భవనాన్ని నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్సీసీ) నిర్మించింది. అప్పటి ఏపీసీఆర్డీఏ ఎలాంటి పబ్లిక్ టెండర్ లేకుండా రూ.5 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను ఎన్సీసీకి కట్టబెట్టారని సామాజిక, పర్యావరణ సమస్యలపై పోరాటం చేసే బెటర్ ఆంధ్రప్రదేశ్ సంఘం ఆరోపించింది. చంద్రబాబు నాయుడుతో సహా నది ఒడ్డున నిర్మించిన ఇళ్లన్నీ చట్టవిరుద్ధమైనవేనని, సుమారు 78కి పైగా అక్రమ కట్టడాలున్నాయని బెటర్ ఆంధ్రప్రదేశ్ తెలిపింది.
జగన్‌కు చంద్రబాబు లేఖ..
పార్టీ కార్యకర్తలను కలవడానికి, సమావేశాలను నిర్వహించుకోవటానికి వీలుగా ప్రస్తుతం తాను నివాసం ఉంటున్న భవనాన్ని ప్రజా వేదికగా వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే బాబు అభ్యర్థనపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.