Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

చనిపోయిన వ్యక్తి ఆధార్‌తో రిజిస్ట్రేషన్‌

భూములను రిజిస్ట్రేషన్‌ చేయాలంటే ఆధార్‌ తప్పనిసరి. దీంతో పాటూ మనిషి ప్రాణంతో ఉండటమూ అవసరమే. కానీ, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? నెల్లూరులో చనిపోయిన వ్యక్తి పేరిట నకిలీ ఆధార్‌ సృష్టించి.. ఆయన పేరు మీద భూముల లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు చేసేశారు!
23 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి పేరిట నకిలీ ఆధార్‌ కార్డు సృష్టించి, ఆయన పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు జరిపిన వైనం నెల్లూరు పట్టణంలోని హరినాథపురంలో బయటపడింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ టి.చిరంజీవులు చొరవతో ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లి క్రిమినల్‌ కేసు కూడా నమోదయింది.
హైదర్‌నగర్‌లో 300 గజాల ఫ్లాట్‌..
నెల్లూరు పట్టణంలోని హరినాథపురంనకు చెందిన కె.ప్రకాశ్‌రావు 1996, మేలో చనిపోయారు. ఆయన మరణించినట్టు అదే ఏడాది జూన్‌లో మరణ ధ్రువీకరణ పత్రం కూడా రిజిస్టర్‌ అయింది. కానీ, ఆయన బతికే ఉన్నట్టు ఆధార్‌ కార్డు సృష్టించిన అక్రమార్కులు నకిలీ ఆధార్‌ సాయంతో కూకట్‌పల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సేల్‌ డీడ్‌ నెంబర్‌: 1953/2019 ద్వారా హైదర్‌నగర్‌లోని 300 చదరపు గజాల ఫ్లాట్‌ను ఈ ఏడాది మార్చిలో రిజిస్టర్‌ చేశారు. ఆ తర్వాత 45 రోజుల వ్యవధిలో అవే దస్తావేజులను మరో రెండు సార్లు రిజిస్టర్‌ చేశారు. విషయం ఐజీ చిరంజీవులు దృష్టికి తీసుకెళ్లడంతో కూకట్‌పల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ జహంగీర్‌ చేత కూకట్‌పల్లి పీఎస్‌లో క్రిమినల్‌ కేసు నమోదు చేయించారు. విచారణకు సహకరించేందుకు వీలుగా సదరు సబ్‌ రిజిస్ట్రార్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో శామీర్‌పేట సబ్‌ రిజిస్ట్రార్‌ శేష గిరిచంద్‌ను ఇంచార్జిగా నియమించారు.
పరిశీలించుకోండి: ఐజీ చిరంజీవులు
ఈ ఘటన నేపథ్యంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, నివాస స్థలాలకు సంబంధించి క్రయ, విక్రయ లావాదేవీలు జరిపినప్పుడు, ఆస్తులు కొనుగోలు చేసినప్పుడు అన్ని డాక్యుమెంట్లను పరిశీలించుకోవాలని, అమ్మినవారు సరైన వారా కాదా అనే విషయాన్ని పరిశీలించుకోవాలని ఐజీ చిరంజీవులు ఒక ప్రకటనలో కోరారు.

Related Posts

Latest News Updates