గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అకిరా మియావాకి ప్రణాళికల్లో బిజీబిజీగా ఉంది. ఖాళీ ప్రదేశాల్లో అడవులుగా మార్చే ప్రక్రియ అకిరా మియావాకి టెక్నాలజీని నగరంలోకి తీసుకురానుంది. రెండు, మూడేళ్ల కాల వ్యవధిలోనే దట్టమైన అడవిగా అభివృద్ధి చెందడమే ఈ టెక్నాలజీ ప్రత్యేకత. జీహెచ్ఎంసీ వెస్ట్ జోనల్లో మియవాకి ఫారెస్ట్‌లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఎక్కడెక్కడ పెంచుతున్నారంటే?
బీహెచ్ఈఎల్లో 13 ఎకరాలు, గచ్చిబౌలి స్టేడియంలో 2 ఎకరాలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 3 ఎకరాలను మియవాకి ఫారెస్ట్ ఏర్పాటు కోసం కేటాయించారు. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో 10 లక్షల మొక్కలను నాటేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. బెంగుళూర్, చెన్నై, మహారాష్ట్రలో మియవాకి టెక్నాలజీతో స్థానిక జాతుల చెట్లతో అడవులను అభివృద్ధి చేశారు. అదే తరహాలో తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా జీహెచ్ఎంసీ వెస్ట్ జోనల్ పరిధిలో శ్రీకారం చుట్టడం గమనార్హం.
ఎలా పెంచుతారంటే?
భూమి సారాన్ని పెంచేందుకు పశువులు, మేకల ఎరువుతో పాటు వర్మి కంపోస్ట్‌ను వేస్తారు. మియవాకి టెక్నాలజీలో అడవులను పెంచేందుకు వీలుగా తేమ నిల్వ ఉండేటట్లుగా సారవంతమైన నేలగా మార్చుతారు. ఎకరం విస్తీర్ణంలో స్థానిక జాతులకు చెందిన దాదాపు లక్ష మొక్కలు నాటుతారు. ఒక్కొ పిట్లో 8 నుంచి 12 అడుగుల ఎత్తు ఉన్న స్థానిక జాతుల 8 మొక్కలను నాటుతారు. మొక్కలకు మధ్య, పిట్లకు మధ్య వ్యత్యాసం తక్కువగా ఉంటుంది. తక్కువ మోతాదులో రెండు సంవత్సరాల పాటు వర్షాలు లేని సమయంలో నీటిని అందిస్తే ఆ తరువాత నీటితో పని లేకుండా పెరుగుతాయి. దట్టమైన అడవిగా మారుతోంది.
కంపెనీలు సీఎస్ఆర్ నిధులతో..
అయితే అకిరా మియావాకి కోసం ప్రభుత్వ నిధులు కేటాయించకపోయినప్పటికీ వివిధ కంపెనీలు సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా అడవుల ఏర్పాటు, నిర్వహణకు ముందుకు వచ్చాయి. ఎన్టీపీసీ, జెన్‌క్యూ, ఎక్స్‌గాన్, సీజీఐ కంపెనీలు మియవాకి ఫారెస్ట్‌ను అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చాయి. సీఎస్ఆర్లో భాగంగా ఎకరం విస్తీర్ణంలో ఫారెస్ట్‌ను అభివృద్ధి చేసేందుకు రూ. 15 లక్షలను ఖర్చు చేయనున్నాయి. రెండు సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యతను తీసుకోనున్నాయి.
మియవాకి టెక్నాలజీ అంటే ఏంటి?
జఫాన్లోని హిరోషిమా యూనివర్సిటీలో వృక్ష శాస్త్రవేత్తగా పనిచేసిన అకిర మియవాకి 1992లో రియోడి జనీరోలో జరిగిన ఎర్త్ సమ్మిట్‌లో అంతరిస్తున్న అడవులపై ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక జాతుల మొక్కలతో సహజ అడవులను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కానించారు. ఈ క్రమంలోనే సహజ వృక్ష సంపదపై అధ్యయనం చేశారు. పర్యావరణ క్షీణత కలిగిన నేలలపై స్థానిక చెట్ల విత్తనాలను నాటి అడవులుగా పునరుద్ధరించారు. దీనిని మియవాకి పద్ధతి అని పిలుస్తారు. భూసారాన్ని పెంచి తేమ ఎక్కువగా ఉండేటట్లు చేసిన తరువాత గుంపులు గుంపులుగా మొక్కలు నాటి చిట్టడవులుగా మార్చుతారు.