గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆదాయ వనరుల్లో ప్రధానమైనవి ఆస్తి పన్ను, టౌన్‌ప్లానింగ్ ఫీజులే. ఈ సంవత్సరం జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం 1800 కోట్లుగా పెట్టుకుంది. గత నెలాఖరు నాటికి రూ.680 కోట్లు వసూలు చేసింది. ఈనెల పదో తేదీ వరకు రూ.15 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. పరిస్థితి ఇలాగే ఉంటే జీతాల చెల్లింపులు కష్టం కావడంతో దినవారీ టార్గెట్ నిర్ధారించింది.
ఎర్లీబర్డ్ 5 శాతం రాయితీ..
ఏప్రిల్ నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగా, ఏప్రిల్ నెలలో ఎర్లీబర్డ్ పథకం ఉండటంతో 5 శాతం రాయితీని వినియోగించుకొని ఎక్కువమంది ఆస్తిపన్ను చెల్లించడంతో జీతాల చెల్లింపులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏప్రిల్, మే నెలలు గడిచిపోయాయి. దాదాపు రూ. 500 కోట్ల ఆస్తిపన్ను వసూలు కావడంతో ఆ ఇబ్బందులు తప్పాయి. తిరిగి గత నెల నుంచి ఇబ్బందులు తలెత్తడంతో ఆస్తిపన్ను వసూళ్లపై దృష్టిసారించిన అధికారులు సర్కిళ్లకు దినవారీ టార్గెట్లు విధించారు. ఈ నెల రూ.123 కోట్ల వసూళ్లు లక్ష్యంగా నిర్ధారించారు.
రోజుకు రూ.2 లక్షల నుంచి..
సర్కిళ్ల వారీగా ఆయా ప్రాంతాలు, డిమాండ్, ఇంత వరకు వసూలైన మొత్తం తదితరమైనవి బేరీజు వేసి ఒక్కో సర్కిల్లో ప్రతిరోజు సగటున రూ.2 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు వసూలు లక్ష్యాన్ని నిర్దేశించారు. అందుకనుగుణంగా పని చేపట్టిన సిబ్బంది శుక్రవారం వరకు రూ.96 కోట్లు వసూలు చేశారు. గత సంవత్సరం ఇదే రోజుతో పోలిస్తే రూ.154 కోట్లు అదనంగా సేకరించారు. గత సంవత్సరం ఇదే రోజు వరకు రూ.560 కోట్లు వసూలు కాగా ఈ సంవత్సరం రూ.714 కోట్లు వసూలైందని కమిషనర్ దానకిశోర్ పేర్కొన్నారు.