హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న టీఎస్ఎస్ గ్రూప్ బిచాణా ఎత్తేయనుందా? కస్టమర్లు, ఇన్వెస్టర్లు, బ్యాంక్ రుణాలకు టాటా చెప్పేయనుందా? టీఎస్ఎస్ గ్రూప్‌లోని తాజా పరిణామాలు చూస్తుంటే నిజమేననిపిస్తుంది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) తనిఖీల్లోనూ విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి.
మాదాపూర్‌లోని కావూరీహిల్స్లోని టీఎస్ఎస్ టవర్స్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న టీఎస్ఎస్ గ్రూప్‌లో 15 అనుబంధ కంపెనీలున్నాయి. వీటిలో 10 కంపెనీలు హైదరాబాద్ ఆర్వోసీ పరిధిలో, 2 కంపెనీలు విజయవాడ, 3 చెన్నై ఆర్వోసీ పరిధిలో ఉన్నాయి. టీఎస్ఎస్ గ్రూప్‌కు రమేష్ హరిదాస్, ఉర్వశీ రమేష్ భార్యభర్తలిద్దరు డైరెక్టర్లుగా ఉన్నారు. హైదరాబాద్ ఆర్వోసీలోని కంపెనీల్లో 9 ప్రై.లి. కంపెనీలుగా కాగా.. ఒకటి లిమిటెడ్ లయబులిటీ పార్టనర్షిప్ (ఎల్ఎల్పీ) కంపెనీ.
టీఎస్ఎస్ గ్రూప్ కంపెనీలివే..
న్యూ హెవెన్ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ట్రాన్స్‌జెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రతీక్ ఎంటర్ప్రైజెస్ ప్రై.లి., నందినీ ఇండస్ట్రీస్ ఇండియా ప్రై.లి., ఆమ్ కన్సల్టెన్సీ ప్రై.లి., ట్రాన్స్ఫ్రైట్ మరైన్ సర్వీసెస్ ప్రై.లి., గిరిజా ఆగ్రోకెమికల్స్ లిమిటెడ్, టెక్ట్రాన్స్ కన్స్ట్రక్షన్ ఇండియా ప్రై.లి., న్యూ హరిజాన్ ఇండ్ వెంచర్స్ ప్రై.లి., న్యూ సవేరా ప్రాజెక్ట్స్ ప్రై.లి., ఇషా నేచురల్ అండ్ హెర్బల్ ప్రొడక్ట్స్ ప్రై.లి., ఆమ్శ్రీ కోక్ ఇండియా ప్రై.లి.
ట్రాన్స్‌జెల్ ఇరాన్‌కు షిఫ్ట్..
టీఎస్ఎస్ గ్రూప్‌లోని చాలా కంపెనీలు 2016 ఆర్ధిక సంవత్సరం నుంచి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఆఫైర్స్ (ఎంసీఏ)కు బ్యాలెన్స్ షీట్స్‌ను సమర్పించడం లేదు. గ్రూప్ డైరెక్టర్లు రమేష్ హరిదాస్, ఉర్వశీ రమేష్‌ల డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ (డీఐఎన్) డీ–యాక్టివేట్‌లో ఉన్నాయి. న్యూ హెవెన్ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ గతేడాది బీఎస్ఈ నుంచి డీ–లిస్ట్ అయింది. ట్రాన్స్‌జెల్ ఇండస్ట్రీస్ కార్యకలాపాలు ఇరాన్‌కు బదిలీ అయ్యాయి. దీనికి రమేష్, ఉర్వశీలతో పాటూ ఇరాన్ పార్టనర్ హెర్మాన్ జోసెఫ్ కూడా డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ విషయమై టీఎస్ఎస్ గ్రూప్ డైరెక్టర్ రమేష్ హరిదాస్‌ను ప్రశ్నించగా.. ‘‘పటాన్చెరులో ప్లాంట్ పెడతామని అనుకున్నాం. కానీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్లాంట్‌ను, మిషనరీని ఇరాన్‌కు బదిలీ చేయాల్సి వచ్చిందని’’ ఆయన బదులిచ్చారు.
రూ.500 కోట్లకు పైగా రుణాలు..
1999 నుంచి టీఎస్ఎస్ గ్రూప్‌కు రుణాల చరిత్ర ఉంది. ఎంసీఏ రికార్డుల ప్రకారం టీఎస్ఎస్ గ్రూప్‌కు రూ.500 కోట్లకు పైగా రుణాలున్నాయి.
ఏ కంపెనీకి ఎంత రుణాలున్నాయంటే?
– విజయవాడ ఆర్వోసీకి చెందిన న్యూ హెవెన్ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్‌కు రూ.1221900000, న్యూ హరిజోన్ ఇండ్ వెంచర్స్‌కు రూ.295500000 రుణాలున్నాయి.
– చెన్నై ఆర్వోసీకి చెందిన ఆమ్ కన్సల్టెన్సీకి రూ.10500000, ట్రాన్స్ఫ్రైట్ మెరైన్‌కు రూ.10000000 రుణాలున్నాయి.
– హైదరాబాద్ ఆర్వోసీకి చెందిన ట్రాన్స్‌జెల్ ఇండస్ట్రీస్‌కు రూ.1193200000, నందినీ ఇండస్ట్రీస్‌కు రూ.901800000, టెక్ట్రాన్స్ కన్స్ట్రక్షన్స్ ఇండియాకు రూ.649543445 రుణాలున్నాయి.
ఉద్యోగులు లేరు.. బోర్డులూ లేవు..
టీఎస్ఎస్ గ్రూప్‌లో ఆర్వోసీ తనిఖీలు చేసేందుకు వెళ్లగా కంపెనీ పేర్ల బోర్డులు లేవు. ఉద్యోగులు లేరు. అన్నీ ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. నందినీ ఇండస్ట్రీస్‌లో ఉన్న 8–10 మంది ఉద్యోగులనే మిగిలిన అనుబంధ కంపెనీలకు ఉద్యోగులుగా చూపిస్తున్నారని ఆర్వోసీ అధికారులు చెబుతున్నారు. టీఎస్ఎస్ గ్రూప్‌లోని చెన్నై కంపెనీలతో పాటూ ఆమ్ కన్సల్టెన్సీ, ట్రాన్స్ఫ్రైట్ మరైన్ సర్వీసెస్ ప్రై.లి., గిరిజా ఆగ్రోకెమికల్స్ లిమిటెడ్, టెక్ట్రాన్స్ కన్స్ట్రక్షన్ ఇండియా కంపెనీల్లోనూ క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆర్వోసీ లెక్కలే తప్పు..
ఆర్వోసీ తనిఖీల మీద వివరణ కోరేందుకు ప్రయత్నించిన విలేకరికి టీఎస్ఎస్ గ్రూప్ యాజమాన్యం పొంతనలేని సమాధానాలిచ్చింది. ‘‘టీఎస్ఎస్ గ్రూప్ కంపెనీలకు రూ.160 కోట్ల వరకు రుణాలుంటాయని, చాలా వరకు బ్యాంక్‌లకు రుణాలను తీర్చేశామని కంపెనీ హెచ్ఆర్ ప్రతినిధి ఒకరు తెలిపారు. హైదరాబాద్‌లో ప్రైమ్ ప్రాపర్టీలు నాలుగున్నాయి. వాటిని విక్రయించి.. మిగిలిన రుణాలను తీర్చడానికి ప్రయత్నిస్తున్నాం. ఏడాది కాలంలో ఈ పని జరిగిపోతుందని’’ ఆయన వివరించగా.. ‘‘మాకు ఒక్క రూపాయి లోన్ లేదు. ఆర్వోసీ రికార్డులే తప్పులున్నాయి. చాలా వరకు బ్యాంక్‌లకు రుణాలను తీర్చేశాం. బ్యాంక్‌లు ఆర్వోసీకి అప్డేట్ చేయలేదని’’ రమేష్ హరిదాస్ తెలిపారు.
గతంలో ఆమ్శ్రీ కోక్ మీద కేసు..
గతంలో ఆమ్శ్రీ కోక్ ఇండియా ప్రై.లి. మీద కేసు నమోదైంది. అప్పటి ఏపీఐఐసీ విశాఖపట్నంలో కోల్‌కత్తాకు చెందిన ఓ కంపెనీకి భూమిని ఇచ్చింది. ఈ స్థలాన్ని స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ) కింద ఆమ్శ్రీ కోక్ తీసుకుంది. ఈ విషయంలో ఇరు కంపెనీల మధ్య పెద్ద స్థాయిలో నగదు లావాదేవీలు జరిగాయని, కోర్టులో కేసు నమోదైంది. తర్వాత దీన్ని ఇరు కంపెనీలు ‘సెట్’ చేసుకున్నారు.