Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

టీఎస్‌–రెరాపై రాజకీయ ఒత్తిళ్లు!

టీఎస్‌–రెరా నమోదు గడువు ఈనెల 31. ఇలా గడువు పొడిగించడం రెరాకు కొత్తమీ కాదండోయ్‌.. పదిమార్లకు పైగానే ఎక్స్‌టెండ్‌ చేశారు. అయితే గడువు పొడిగింపు వెనక అసలు రహస్యం డెవలపర్లకు మరొక అవకాశం ఇద్దామని కాదు.. స్థానిక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి!
.. ఇదీ తెలంగాణ స్టేట్‌ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్‌–రెరా) పరిస్థితి. రెరాలో నమోదుకు అవకాశమిస్తే పట్టించుకోని డెవలపర్లు ఒకవైపు.. నోటీసులు, జరిమానాలు విధిస్తేనేమో అదే డెవలపర్లు రాజకీయ నాయకులతో కలిసి అధికారులపై ఒత్తిళ్లు మరొకవైపు.. వెరసి టీఎస్‌–రెరా నమోదు ప్రక్రియ కొనసా…..తుతోంది!
గృహ కొనుగోలుదారులకు భరోసా కల్పించే రెరా చట్టం… తెలంగాణలో మాత్రం స్థానిక రాజకీయ ఒత్తిళ్లకు గురవుతుంది. 2017 ఆగస్టులో టీఎస్‌–రెరా అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం సుమారు 6 వేల ప్రాజెక్ట్‌లు రెరాలో నమోదు కావాల్సి ఉండగా నేటికీ సగానికి కూడా చేరుకోలేదు. ప్రభుత్వ విభాగాల నుంచి, స్థానికుల ఫిర్యాదులు ద్వారా, భౌతిక పర్యవేక్షణ ఇలా అన్ని రకాలుగా సమాచారాన్ని సేకరించి ఆయా డెవలపర్లకు షోకాజ్‌ నోటీసులు అందిస్తున్నారు టీఎస్‌–రెరా అధికారులు. కానీ, డెవలపర్లేమో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో చేసేదేంలేక నమోదు గడువును పొడిగించాల్సి వస్తుందని ఓ అధికారి వాపోయారు.
లీడర్లు, బిల్డర్లు కుమ్మక్కు..
జూబ్లిహిల్స్‌లో ఆఫీసు ఉన్న ఓ నిర్మాణ సంస్థ కొంపల్లిలో ఒక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఈ కంపెనీ ప్రమోటర్లలో ఒకరు అధికార పార్టీలోని కీలకవ్యక్తికి సమీప బంధువు. ప్రాజెక్ట్‌ను రెరాలో నమోదు కాకుండానే విక్రయాలు చేస్తున్న సంస్థను సంప్రదించిన మీడియా, రెరా అధికారులకు పెద్దలతో ఫోన్లు చేయించిన సంఘటన తాజాగా చోటుచేసుకుంది. ఎన్నికల సమయంలో నిధులను సమకూర్చడం, అపార్ట్‌మెంట్‌ సంఘాల్లో ఎన్నికల ప్రచారం, నిర్మాణ సంస్థల్లో ప్రమోటర్లుగా ఉండటం, నయానో భయానో ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతులు ఇప్పించడం తదితర కారణాలతో డెవలపర్లకు స్థానిక నాయకులతో సత్సంబంధాలు నెలుస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులకు భరోసా కల్పించే చట్టాన్ని, అందులోని నిబంధనలను యదేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించే అధికారులపై లీడర్లను ప్రయోగిస్తున్నారు. కొంపల్లి, షాద్‌నగర్, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లో రెరాలో నమోదు చేయకుండా విక్రయాలు చేస్తున్న వందలాది మంది డెవలపర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి ఎలాంటి చర్యలు తీసుకోకపోవటమే ఇందుకు ఉదాహరణ అని కొనుగోలుదారుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
చిన్న ప్రాజెక్ట్‌లకు సేమ్‌ జరిమానా?
పంజగుట్టలో 20 ఫ్లాట్ల ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది ఓ సంస్థ. దాదాపు 80 శాతం అమ్మకాలు పూర్తయ్యాయి. కానీ, నేటికీ ఆ ప్రాజెక్ట్‌ను రెరాలో నమోదు చేసుకోలేదు. ఎందుకని ప్రశ్నించగా.. ‘‘మా ప్రాజెక్ట్‌లో దాదాపు అమ్మకాలు పూర్తయ్యాయి. రూ.3 లక్షలు ఫైన్‌ కట్టి మరీ రెరాలో నమోదు చేసుకోవటం వల్ల ప్రయోజనం ఏంటి? ప్రాజెక్ట్‌ మీద లాభం కూడా అంత ఉండదు. కనీసం అవే డబ్బులను ప్రాజెక్ట్‌లో వసతులకు కేటాయిస్తే కస్టమర్లయినా సంతృప్తిపడతారని’’ వివరించారు. పెనాల్టీ ఎక్కువగా ఉండటం వల్లే నమోదుకు డెవలపర్లు ముందుకు రావట్లేదు. 10 ఫ్లాట్ల ప్రాజెక్ట్‌లకు, 100 ఫ్లాట్లున్న ప్రాజెక్ట్‌కు రూ.3 లక్షలు జరిమానా ఉండటం సరైంది కాదని, ఫ్లాట్ల సంఖ్యను బట్టి ఫైన్‌ ఉండాలని సూచించారు.
రెరా ఏమైనా సర్వీస్‌ ప్రొవైడరా..
ప్రాపర్టీ ట్యాక్స్‌ ఎందుకు కడతాం? మున్సిపాలిటీ సర్వీసెస్‌ అందిస్తుంది కాబట్టి. బ్యాంక్‌కు వడ్డీ ఎందుకు కడతాం? గృహ రుణం తీసుకున్నాం కాబట్టి. మరి, ఎలాంటి సర్వీస్‌ అందిస్తుందని రెరాలో నమోదు చేసుకోవాలి? జరిమానా కట్టాలి? అని మలక్‌పేటకు చెందిన ఓ డెవలపర్‌ ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్, జరిమానాల రూపంలో ఆదాయాన్ని పెంచేందుకే ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు.
అవినీతిరహిత గ్రివెన్స్‌ సెల్‌..
రిజిస్టర్‌ విషయంలో డెవలపర్లకు సందేహాలు వస్తే నివృత్తి చేసేందుకు టీఎస్‌–రెరా కార్యాలయంలో గ్రివెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే అందులో కూడా ఎలాంటి అవినీతికి తావులేని సేవలందించాలని, అంతేతప్ప డెవలపర్‌ వచ్చాడు కదా నాకేమిస్తావ్‌ అనే తరహాలో ప్రవర్తించకూడదని సూచించారు.

Related Posts

Latest News Updates