Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

ట్రాఫిక్‌ ఇంపాక్ట్‌ ఎన్‌వోసీ ఉంటేనే అనుమతులు!

డెవలపర్ల నెత్తిన కొత్తగా మరొక ఎన్‌వోసీ (నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం) బండ పడనుంది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ, ఫైర్, ఇరిగేషన్, రెవిన్యూ, కలెక్టర్, పోలీస్‌.. ఇలా ఎన్‌వోసీల జాబితా చాంతాడంత ఉంది. ఇవి చాలవన్నట్లు ప్రభుత్వం కొత్తగా ట్రాఫిక్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ సర్టిఫికెట్‌ ఎన్‌వోసీని తీసుకురానుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో బహుళ అంతస్తులు, వాణిజ్య భవనాల నిర్మాణాలకు ఇక నుంచి ట్రాఫిక్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే అనుమతులను మంజూరు చేయనున్నారు. త్వరలోనే జీహెచ్‌ఎంసీ మార్గదర్శకాలను విడుదల చేయనుంది.
వ్యయం కూడా డెవలపర్ల నుంచే..
నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఐటీ కంపెనీలు, బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్‌ మాల్స్, మల్టీప్లెక్స్‌లు ఉండే ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవుతుంది. ఈ నేపథ్యంలో కొత్తగా నిర్మాణాలు చేపట్టే వారికి ట్రాఫిక్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ ఉంటేనే అనుమతులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాపిక్‌ సమస్యను పరిష్కరించడానికి ఆయా కారిడార్లను అభివృద్ధి చేయడానికి జీహెచ్‌ఎంసీకి అయ్యే వ్యయంలో కొంత శాతాన్ని ఇంపాక్ట్‌ ఫీజుగా డెవలపర్ల నుంచి వసూలు చేయనున్నారు.
ఎలా అంచనా వేస్తారంటే?
దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఈ ట్రాఫిక్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ సర్టిఫికెట్‌ విధానాన్ని తీసుకురానున్నారు. నిర్మాణాలకు అనుమతులు జారీ చేసే ముందే ఆ భవనాల వల్ల అక్కడ కలిగే ఇబ్బందులను జీహెచ్‌ఎంసీ అంచనా వేస్తుంది. ఆ భవనాల్లో ఏర్పాటయ్యే వాణిజ్య సంస్థల ద్వారా ఎంత రద్దీ పెరుగుతుంది? ఎన్ని వాహనాలకు పార్కింగ్‌ సదుపాయం ఉంది? అక్కడి రహదారిపై ఏర్పడే ట్రాఫిక్‌ చిక్కులు వంటివాటిని పరిగణలోకి తీసుకొని ఈ ట్రాఫిక్‌ ఇంపాక్ట్‌ ఎన్‌వోసీని జారీ చేస్తారు. దీన్ని జత పరిస్తేనే మిగిలిన ప్రభుత్వ విభాగాలు నిర్మాణ అనుమతులను మంజూరు చేస్తాయి.
లింక్‌ రోడ్లు ఉంటేనే..
ఉదాహరణకు ఒక మల్టిప్లెక్స్‌ భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటే బిల్టప్‌ ఏరియా ఎంత? అందులోని సినిమా స్క్రీన్లు, షాపులు, పార్కింగ్‌ ఏరియా వంటి వాటిని లెక్కిస్తారు. సినిమా ముందు, తర్వాత అక్కడ పెరిగే ట్రాఫిక్‌ను అంచనా వేస్తారు. ప్రస్తుతం అక్కడున్న రహదారి జనాభాకు సరిపోతుందా? లేనట్లయితే దాన్ని విస్తరించేందుకు అవకాశం ఉందా? సమీపంలో ఉన్న జంక్షన్లు ఏంటి? ఇలా వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. రద్దీ సమస్య పరిష్కారానికి బిల్డర్‌ ఎక్కువ సెట్‌బ్యాక్‌లు వదిలేందుకు ముందుకు వచ్చినా.. ప్రత్యామ్నాయంగా లింక్‌ మార్గం వంటివి ఉంటే, వాటిని ఏర్పాటు చేస్తేనే అనుమతులు ఇస్తారు.

Related Posts

Latest News Updates