ఏటీఎం, ఆన్లైన్ మోసాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచి సైబర్ క్రిమినల్స్ తాజాగా డెవలపర్లను టార్గెట్ చేశారు. డెవలపర్లమని భూమి యజమానులను, భూములను విక్రయిస్తామని డెవలపర్లను మోసం చేస్తున్నారు. సైబర్ మోసగాళ్ల నుంచి డబ్బు పోగొట్టుకున్న శివారు ప్రాంతాల్లోని అనేక మంది బాధితులు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడమే ఇందుకు ఉదాహరణ.
సైబర్ మోసగాళ్లు శివారు ప్రాంతాల్లో భూమి క్రయవిక్రయాలు జరిపే డెవలపర్లను లక్ష్యంగా చేసుకున్నారు. వార్తా పత్రికలు లేదా ఇతర మాధ్యమాల ద్వారా భూముల సమాచారం, భూమి యజమానుల వివరాలను సేకరిస్తారు. ఆ తర్వాత డెవలపర్లను సంప్రదించి భూములను అమ్మాలనుకుంటున్నట్లు చెబుతారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
గేటెడ్ కమ్యూనిటీలని చెప్పి..
సైబర్ మోసగాళ్లు భూ యజమానులను సంప్రదించి, ఆయా స్థలాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, వెంచర్లను అభివృద్ధి చేస్తామని తమకు తాము బిల్డర్లుగా పరిచయం చేసుకుంటారు. భూమి ధర, ఇతర వివరాలను మాట్లాడి.. యజమానులకు విశ్వాసం కల్పిస్తారు. భూమికి సంబంధించి ఇతర వివరాలు, రికార్డులను పరిశీలించాలని చెప్పి వారి నుంచి డాక్యుమెంట్లను తీసుకుంటారు. ఆ తర్వాత ఈ మోసగాళ్లు భూ యజమానులుగా నటిస్తూ డెవలపర్లు, ఏజెంట్లను సంప్రదిస్తారు. అత్యవసరంగా డబ్బు అవసరముందని చెప్పి సగం ధరకి కూడా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని డెవలపర్లతో ఒప్పందం చేసుకుంటారు.
యజమానులను వ్యక్తిగతంగా కలవాలి..
చాలా మంది డెవలపర్లు ప్రాపర్టీ చరిత్ర, రికార్డుల పరిశీలనే చేస్తారే తప్ప.. భూమి యజమాని వ్యక్తిగత వివరాలను తనిఖీ చేయరు. ఇదే మోసగాళ్లకు ఆయుధంగా మారుతోంది. విక్రయదారుడు లేదా భూమి యజమానిని వ్యక్తిగతంగా కలవకుండా ఆర్ధిక లావాదేవీలు జరిపితే మోసానికి దారితీస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.