దేశంలో రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఖ్య ఏటేటా తగ్గిపోతుంది. 2011–12లో దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో 3,528 మంది రిజిస్టర్డ్ డెవలపర్లు ఉండగా.. 2017–18 నాటికి 1,745కి తగ్గిపోయారు. అంటే ఆరేళ్లలో 50.67 శాతం మంది డెవలపర్లు రియల్టీ వ్యాపారం నుంచి నిష్క్రమించారన్నమాట. ఇదే కాలంలో ప్రధాన నగరాల్లో కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయని ప్రాప్ ఈక్విటీ సర్వే తెలిపింది.
హైదరాబాద్‌లో 387 నుంచి 146కి డౌన్..
హైదరాబాద్‌లో 2011–12లో 387 మంది డెవలపర్లు ఉండగా.. 2017–18 నాటికి 146కి పడిపోయింది. అంటే ఆరేళ్లలో 62.3 శాతం తగ్గిపోయారన్నమాట. ముంబైలో 364 నుంచి 248కి, పుణేలో 658 నుంచి 531కి, థానేలో 680 నుంచి 355కి, బెంగళూరులో 646 నుంచి 252కి, చెన్నైలో 445 నుంచి 101కి, కోల్‌కతాలో 235 నుంచి 83కి, గుర్గావ్లో 82 నుంచి 19కి తగ్గిపోయారు.
టాటా, మహీంద్రా, గోద్రెజ్, పిరామిల్, అదానీ వంటి పెద్ద కంపెనీల ఎంట్రీతో రియల్టీ రంగంలో కన్సాలిడేషన్ మొదలైందని ప్రాప్ ఈక్విటీ తెలిపింది. గుర్గావ్, నోయిడా, ముంబై, థానే, పుణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కత్తా నగరాల్లో 51 శాతం డెవలపర్లు వ్యాపారం నుంచి వైదొలుగుతున్నారు. గత ఆరేళ్ల వ్యవధిలో గుర్గావ్, నోయిడా ప్రాంతంలో అత్యధికంగా 70 శాతం మంది డెవలపర్లు ఈ వ్యాపారం నుంచి ఔట్ అయ్యారు. బెంగళూరు, కోల్‌కత్తాలో 65 శాతం తగ్గిపోయారు.
జీఎస్టీ, రెరా, నోట్ల రద్దు..
వస్తు సేవల పన్ను (జీఎస్టీ), పెద్ద నోట్ల రద్దు, రెరా వంటి వాటితో చిన్న డెవలపర్లు మార్కెట్ నుంచి వైదొలుగుతున్నారని ప్రాప్ ఈక్విటీ ఫౌండర్ అండ్ ఎండీ సమీర్ జాసుజా తెలిపారు. చిన్న డెవలపర్లకు ఆర్ధిక ఇబ్బందులు, మార్కెట్లో ఇన్వెంటరీ సప్లయి ఎక్కువగా ఉండటం, గడువులోగా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయకపోవటం, స్థలాల లభ్యత తగ్గిపోవటం, సప్లయి – డిమాండ్లపై సరైన అవగాహన లేకపోవటం, ధరల నిర్ణయంలో అవగాహనరాహిత్యం, మౌలిక వసతులు సరిగా లేకపోవటం వంటి చాలా కారణాలున్నాయి. కొనుగోలుదారులు గడువులోగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న డెవలపర్లనే ఎంచుకుంటున్నారు. దీంతో చిన్న డెవలపర్లు మార్కెట్ లేక వ్యాపారం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి నెలకొంటుందని పేర్కొన్నారు.