దక్షిణంలో లగ్జరీ..
గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ, నానక్‌రాంగూడ వంటి దక్షిణాది ప్రాంతాల్లో ప్రాజెక్ట్‌లు చేస్తుంటే.. ధర కాసింత ఎక్కువైన పర్వాలేదు. కానీ, వసతులు మాత్రం లగ్జరీగా ఉండాల్సిందే. ఇక్కడ 80 శాతం అమ్మకాలు రెండో ప్రాపర్టీ కొనుగోలుదారులే ఉంటారు. పన్ను మినహాయింపుల కోసం ప్రాపర్టీ కొంటుంటారు. ఇక్కడి విస్తీర్ణాలు కనీసం 1,500 చ.అ. నుంచి, ధర రూ.2,700 నుంచి మొదలవ్వాలి. ప్రాజెక్ట్‌లో స్క్వాష్ వంటి వినూత్న ఆటలకు ప్రాధాన్యమివ్వాలి. షాపింగ్, ఎంటర్టైన్మెంట్ జోన్లు వంటివి ఉండాలి. సెక్యూరిటీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి.
సెంట్రల్లో సూపర్ రిచ్..
బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, హిమాయత్‌నగర్ వంటి సెంట్రల్ ప్రాంతాల్లో బిజినెస్ ఫ్యామిలీలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కనీసం 1,800 చ.అ. విస్తీర్ణం నుంచి మొదలవ్వాలి. ధర చ.అ.కు రూ.3,500–4,500 మధ్య ఉండాలి. సెంట్రల్ ప్రాంతాల్లో స్థలం పెద్దగా అందుబాటులో ఉండదు. కానీ, ఉన్న స్థలంలోనే లగ్జరీ అపార్ట్మెంట్స్ కట్టడం మేలు. ఔట్‌డోర్ గేమ్స్ కంటే ఇండోర్ గేమ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. స్విమ్మింగ్ పూల్, జిమ్, యోగా వంటి వసుతులకు స్థలం కేటాయించాలి. షాపింగ్, ఎంటర్టైన్మెంట్ల వంటివి సమీప దూరంలోనే ఉంటాయి కాబట్టి ప్రాజెక్ట్‌లో వీటికి స్థల కేటాయింపులు చేయకపోయినా పర్వాలేదు.
తూర్పులో గేటెడ్..
ఉప్పల్, ఎల్బీనగర్ వంటి తూర్పు ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లు మేలు. ధర రూ.45 లక్షల లోపు ఉంటే అమ్మకాలు బాగుంటాయి. ఇతర జిల్లాల్లోని కొనుగోలుదారులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వసతుల కంటే ముఖ్యంగా నాణ్యమైన నిర్మాణం, అందుబాటు ధర, గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి అంశాల మీద దృష్టిపెడితే బెటర్. అంతర్జాతీయ వసతుల జోలికి వెళ్లకుండా స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటివి ఉండేలా చూసుకోవాలి.