తెలంగాణ శాసన çసభ సభ్యులు (ఎమ్మెల్యే), శాసన మండలి సభ్యులు (ఎమ్మెల్సీ) గృహ ప్రవేశం చేశారు. హైదర్‌గూడ ఆదర్శ్‌నగర్‌లోని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను కూల్చేసి కొత్తగా నివాస భవన సముదాయాన్ని నిర్మించారు. సోమవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, స్పీకర్, ఇతర మంత్రులతో కలిసి ఈ గృహాలను ప్రారంభించారు.
6,01,532 చదరపు అడుగుల్లో…
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం 6,01,532 చదరపు అడుగుల విస్తీర్ణంలో 120 ఫ్లాట్లతో మెయిన్ బ్లాక్ నిర్మించారు. మూడు సెల్లార్లు+గ్రౌండ్ ఫ్లోర్+12 ఫ్లోర్లతో ఈ బ్లాక్ రెడీ అయింది. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 2,500 చదరపు అడుగులు కాగా ఒక్కో అంతస్తుకు 10 చొప్పున ఫ్లాట్లున్నాయి.
వసతులెన్నో..
ఒక్కో ఫ్లాట్‌లో పెద్దల పడక గది, పిల్లల పడక గది, అతిథుల పడక గది, కామన్ టాయిలెట్, కార్యాలయ గది, లివింగ్ అండ్ డైనింగ్ రూం, వంట గది, స్టోర్ రూమ్‌లు ఉంటాయి. మెయిన్ బ్లాక్‌లోని సెల్లార్లో 81 కార్లు, ఒకటో సబ్ సెల్లార్లో 94 కార్లు, రెండో సబ్ సెల్లార్లో 101 కార్లు కలిపి మొత్తం 276 కార్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు.
– మెయిన్ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎమ్మెల్యేల కోసం 150 చదరపు అడుగుల విస్తీర్ణంతో 23 క్యాబిన్లు, ఒక సెక్యూరిటీ రూం, 6 ప్యాసేజ్ లిఫ్టులు, 2 సర్వీసు లిఫ్టులు, 5 మెట్ల మార్గాలను ఏర్పాటు చేశారు.
అటెండర్లకు కూడా..
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అటెండెంట్ల కోసం ప్రత్యేకంగా 6 అంతస్తుల్లో టవర్‌ను నిర్మించారు. మొత్తం 12 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. సిబ్బంది కోసం 36 ఫ్లాట్లను నిర్మించారు. 810 చ.అ.లో 2 బీహెచ్‌కే 12 ఫ్లాట్లు, 615 చ.అ.ల్లో సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు 24 ఉంటాయి.
1.25 లక్షల చ.అ.ల్లో ఐటీ, ఇన్ఫ్రా కోసం..
ఐటీ, మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకంగా బ్లాక్‌ను నిర్మించారు. ఇది 1.25 లక్షల చదరపు అడుగుల్లో ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో 4,128.50 చదరపు అడుగుల విస్తీర్ణంలో సూపర్‌మార్కెట్, కిచెన్, క్యాంటీన్, స్టోర్ రూమ్ వంటివి ఉంటాయి. తొలి అంతస్తులో 4,701 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆస్పత్రి, రెండో అంతస్తులో ఇండోర్ గేమ్స్, మూడో అంతస్తులో గ్రంథాలయం/ రీడింగ్ హాల్, వ్యాయామశాల, ఆడియో విజువల్ గది, నాలుగో ఫ్లోర్లో బాంక్వెట్ హాల్ వంటి సదుపాయాలను కల్పించారు.
నీళ్లు, పవర్..
గృహ అవసరాల కోసం 0.73 ఎంఎల్డీల నిల్వ సామర్థ్యంతో భూగర్భ మంచినీటి సంపును ఏర్పాటు చేశారు. 250 కేఎల్డీ సామర్థ్యంతో మురుగు నీటి శుద్ధి ప్లాంట్ (ఎస్టీపీ) ఉంటుది. 1,000 కేవీ సబ్ స్టేషన్ ఉంది.