భూ రికార్డుల సమగ్ర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ను ప్రవేశపెట్టింది. 2017లో భూ రికార్డుల ప్రక్షాళనతో రెవెన్యూ వ్యవస్థలో మార్పులు చేసింది. సెంటు భూమికి సైతం హక్కుదారెవరనేది తేల్చేలా భూ రికార్డుల సమగ్ర నిర్వహణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ధరణి వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. కానీ, అసలు సమస్యలు వెబ్సైట్ అందుబాటులోకి వచ్చాకే మొదలయ్యాయి. తహసీల్దార్లకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడం.. ప్రతి దానికి ఆర్డీఓ, జేసీలపై ఆధారపడాల్సి రావటం ప్రధాన సమస్యలు. కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి తెచ్చే ముందు.. సాంకేతిక సమస్యలను సరిచూసుకోవాల్సి వుంటుంది. కానీ, ధరణిని కార్యరూపంలోకి తెచ్చిన తర్వాత లోపాలను సరిదిద్దుతుండడతో ఈ ఇబ్బందులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
సాంకేతిక సమస్యలు ఇవే..
– ఒకే సేల్‌డీడ్‌పై ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసిన భూమికి సంబంధించి మ్యూటేషన్ చేయించుకునేందుకు గతంలో మీ–సేవలో దరఖాస్తు చేసుకుంటే సరిపోయేది. ఇప్పుడలా చేస్తే దరఖాస్తు తిరస్కరణకు గురవుతోంది. తాజాగా ఇరువురు వేర్వేరు దరఖాస్తుల చేసుకోవాల్సి వస్తోంది.
– సర్వే నంబర్ల పునరుద్ధరణ ఆప్షన్ తహసీల్దార్‌కు లేదు. రీ ఓక్ ఆప్షన్‌కు జేసీకి నివేదించాల్సివస్తోంది.
– పూర్తయిన మ్యూటేషన్లకు కేవైసీ తప్పనిసరిగా మారింది. పట్టాదారు విధిగా బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు అందించాలి. కొందరి వేలిముద్రలు అరిగిపోతే డిజిటల్ సంతకం చేయడం కుదరడంలేదు. దీంతో మ్యూటేషన్లను నిలిచిపోతున్నాయి.
– భూ ప్రక్షాళన సమయంలో కాస్రా పహణీ విస్తీర్ణంతో సరిపోలకపోయినా హడావుడిగా వివరాలు నమోదు చేయడం ప్రస్తుతం సమస్యగా మారింది. తాజాగా ఆ వివరాలు కాస్రాతో సరిపోలని కారణంగా మ్యూటేషన్లు కావడంలేదు.
– ఒక పట్టాదారు ఒకే సమయంలో ముగ్గురికి భూమిని విక్రయిస్తే, ఆ భూమికి సంబంధించి మ్యూటేషన్లు ఒకేసారి చేయడం వీలు కావడంలేదు. ఒకరికి పూర్తయిన తర్వాతనే మరొకరివి చేయాల్సివస్తోంది. దీంతో ఒక్కో దరఖాస్తు మధ్య కనీసం 20 రోజుల సమయం పడుతోంది.
– భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో ఆధార్ వివరాలను సమర్పించని రైతుల ఆధార్ నంబర్ ఇప్పుడు నమోదు చేయాలంటే ఆర్డీఓ అనుమతి తీసుకోవాల్సివస్తోంది.