Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

తెలంగాణ రెరా.. ప్చ్‌!

తెలంగాణ రెరా లక్ష్యం తప్పుతుంది. రెరా పనితీరు మీద కొనుగోలుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత, గడువు, పారదర్శకత, ధర, క్రయ విక్రయాల్లో స్పష్టత, డెవలపర్లు, ఏజెంట్ల వివరాలు.. ఇలా ప్రతి ఒక్కటీ అందుబాటులో ఉంచాల్సిన రెరా.. అసలు లక్ష్యం దారి తప్పుతుంది. దీంతో కొనుగోలుదారులకు భరోసా కలిగించాల్సిన రెరా అసంతృప్తిని మిగులుస్తుందని కొనుగోలుదారుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
కేంద్రం 2016లో రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ చట్టాన్ని అమలులోకి తీసుకొస్తే.. తెలంగాణ ప్రభుత్వం 2017లో నోటిఫై చేసింది. 2017 జనవరి 1 తర్వాత అనుమతి పొందిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్‌ రెరాలో నమోదు చేసుకోవాలని ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, యూడీసీ, పంచాయతీలు, టీఎస్‌ఐఐసీ పరిధిలో 500 మీటర్లు లేదా 8 పైన ఫ్లాట్లు ఉన్న ప్రతి ప్రాజెక్ట్‌ రెరా పరిధిలోకి వస్తుంది. 
రెరా ముందు.. తర్వాత!
2017 జనవరి 1 నుంచి 2018 ఆగస్టు 30 మధ్య అనుమతి పొందిన ప్రాజెక్ట్‌లు టీ–రెరాలో నమోదు చేసుకోవాలి. నమోదు చేశాకే ప్రకటనలు, అమ్మకాలు చేయాలి. మరి, 2017 జనవరి 1 కంటే ముందు అనుమతి పొందిన ప్రాజెక్ట్‌ల పరిస్థితి ఏంటి? ఆయా ప్రాజెక్ట్‌లను అడ్వటయిజింగ్‌ చేస్తే వాటికి సంబంధించిన అనుమతి పత్రాలు, నంబర్లు, తేదీలు ప్రకటనలో తప్పకుండా ప్రకటించాలని యునైటెడ్‌ ఫెడేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్స్‌ (యూ–ఎఫ్‌ఈఆర్‌డబ్ల్యూఏఎస్‌) డిమాండ్‌ చేసింది. అప్పుడే కొనుగోలుదారులకు సంబంధింత ప్రాజెక్ట్‌ రెరాకు ముందా? లేక తర్వాతి ప్రాజెక్టా అనేది స్పష్టత వస్తుందని పేర్కొంది.
వసూళ్లకే రెరా..
ప్రస్తుతం టీ– రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లు, ప్రమోటర్లు, ఏజెంట్ల వివరాలను క్షుణ్నంగా గమనిస్తే.. కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే అందుబాటులో ఉందని, ప్రాజెక్ట్‌ నిర్మాణ స్థితి గతులు, క్రయ విక్రయాల సంఖ్య, ప్రాజెక్ట్‌ బ్యాంక్‌ ఖాతా వివరాలు, ప్రమోటర్ల ఆదాయ వివరాలు వంటి కీలక సమాచారం ఏదీ కూడా అందుబాటులో లేదని యూ–ఎఫ్‌ఈఆర్‌డబ్ల్యూఏఎస్‌ జనరల్‌ సెక్రటరీ బీటీ శ్రీనివాసన్‌ తెలిపారు. టీ–రెరాను జస్ట్‌ ప్రాజెక్ట్‌ల నమోదుకు మాత్రమే ఉపయోగిస్తున్నట్టుందని పేర్కొన్నారు. నమోదు రుసుములు, జరిమానాలను వసూలు చేసే విభాగంగా రెరా మిగిలిందని ఆరోపించారు.
వివరాలూ అసంపూర్తిగానే..
టీ– రెరాలో ఇప్పటివరకు ఎంత మంది డెవలపర్లు, ఏజెంట్లు నమోదు చేసుకున్నారు? ఎస్క్రో బ్యాంక్‌ ఖాతా, ప్రాజెక్ట్‌ కాంట్రాక్టర్‌ వివరాలు ఏవీ కూడా కొనుగోలుదారులకు అందుబాటులో లేవు. రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లు ప్రతి మూడు నెలలకొకసారి అప్‌డేట్‌ చేయాలి. ఎన్ని అమ్ముడుపోయాయి? ఇంకా ఎన్ని ఫ్లాట్లు విక్రయానికి ఉన్నాయి? వంటి వివరాలేవీ అప్‌డేట్‌ చేయట్లేదు. గృహ కొనుగోలుదారులకు ఈ వివరాలు చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రాజెక్ట్‌ స్టేటస్, ప్రాంతం అభివృద్ధిని అంచనా వేసుకొని కొనుగోలుదారులు అంతిమ నిర్ణయం తీసుకుంటారు.
జరిమానా వివరాల్లేవ్‌..
గడువులోగా ప్రాజెక్ట్‌లను నమోదు చేయని డెవలపర్లకు రూ.2 లక్షలు జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఎంత మంది డెవలపర్లు జరిమానా కట్టారు? ఆయా ప్రాజెక్ట్‌ల వివరాలేంటి? వంటి సమాచారమేదీ కూడా టీ–రెరాలో అందుబాటులో లేదు. ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఫిర్యాదులు, వాటి పత్రాలు, జడ్జిమెంట్‌ కాపీలు వంటివేవీ వెబ్‌సైట్లలో లేవు. ఈ వివరాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటే ఆయా ప్రాజెక్ట్‌లు రెరాలో నమోదు అర్హత ఉండి మరీ చేసుకోలేదని.. అయినా అమ్మకాలు చేస్తున్నారని కొనుగోలుదారులకే తెలిసిపోతుందని.. దీంతో ఆయా ప్రాజెక్ట్‌లల్లో కొనుగోలు చేయాలా? వద్దా? అనేది వాళ్లే నిర్ణయించుకునే వీలుంటుంది.

Related Posts

Latest News Updates