Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

తెలుగు రాష్ట్రాలకు శూన్య హస్తాలే!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2.ఓ తొలి బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు శూన్య హస్తాలను చూపించారు. ప్రత్యేక నిధులు, స్పెషల్‌ స్టేటస్, ప్యాకేజీలు, జాతీయ హోదా వంటి ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలను విస్మరించారు. రెండు రాష్ట్రాల్లోని ఏ ఒక్క ప్రాజెక్ట్‌కు బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాంచలేదు తెలుగింటి ఆడబిడ్డ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌!
అమరావతికి నిధులు, స్పెషల్‌ స్టేటస్‌..
స్పెషల్‌ స్టేటస్‌ సాధించేవరకూ పోరాడతామని కంకణం కట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక పలుమార్లు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. తన ఎంపీల బృందం, ముఖ్య కార్యదర్శిలతో భేటీ ఆయ్యారు. ఏపీకి అన్ని రకాలుగా అండగా ఉంటామని మోదీ హామీ ఇచ్చారని జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. కానీ, ఇదంతా ఒట్టి మాటలేనని బడ్జెట్‌ సందర్భంగా తేటతెల్లమైంది. ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వటం గురించి పక్కన పెడితే బడ్జెట్‌లో దాని గురించి ప్రస్థావన కూడా తీయకపోవటమే దీనికి ఉదాహరణ. నాలుగేళ్ల క్రితం అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంగా నరేంద్ర మోదీ ఏపీకి అన్ని రకాల ఆర్ధిక సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటివరకు అమరావతి నిర్మాణానికి ప్రత్యేక నిధుల కేటాయింపు జరగలేదు. బడ్జెట్‌ అనంతరం ఇది నిరాశపూరితమైన బడ్జెట్‌ అని వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ లీడర్‌ వీ విజయసాయి రెడ్డి న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో తెలిపారు.
లోటు బడ్జెట్‌ విస్మయం..
గత తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రభుత్వం రూ.16 వేల కోట్ల ఆదాయ లోటును చూపించింది. అయితే టీడీపీ, ఎన్‌డీఏ ప్రభుత్వాల మధ్య చర్చల తర్వాత కేంద్రం రూ.7 వేల కోట్ల నిధులను చెల్లించడానికి మధ్య ఒప్పందం కుదిరింది. కానీ, 2014–19 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం రూ.4 వేల కోట్ల నిధులను కేటాయించింది. మిగిలిన రూ.3 వేల కోట్లను కేటాయింపును విస్మరించారు. 2018–19 వరకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.746 కోట్ల నిధులను కేటాయించింది. 2018–19 సంవత్సరానికి గాను ఎలాంటి నిధులను ప్రకటించలేదు.
మెట్రో రైలు, పోర్ట్‌ అన్నీ ఉత్తి మాటలే..
విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ప్రతిపాదిత మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌లను కేంద్రం బడ్జెట్‌లో ఒక్క రూపాయిని కూడా కేటాయించలేదు. విశాఖపట్నం వంటి చిన్న విమానాశ్రయాల అభివృద్ధి కోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుడులు (ఎఫ్‌డీఐ) నిబంధనల సరళీకరణ ప్రతిపాదనను పట్టించుకోలేదు. నెల్లూరులోని దుగరాజపట్నం పోర్ట్‌ కేటాయింపుల ఊసేలేదు. అమరావతిలోని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ నిర్మాణానికి ఎలాంటి నిధులను కేటాయించలేదు.
సెంట్రల్‌ వర్సిటీకి రూ.13 కోట్లు..
నిర్మలా సీతారామన్‌ తన తొలి బడ్జెట్‌లో ఏపీకి కేటాయించిన నిధులు రూ.21 కోట్లు. అనంతపురంలోని సెంట్రల్‌ యూనివర్సిటీకి రూ.13 కోట్లు, విజయనగరం జిల్లాలో రానున్న గిరిజన యూనివర్సిటీకి రూ.8 కోట్ల నిధులను కేటాయించారు.
తెలంగాణ విషయంలోనూ మోదీ మాయే..
తెలంగాణ విషయానికొస్తే.. ఫార్మా సిటీ, రీజినల్‌ రింగ్‌ రోడ్డు, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ల గురించి బడ్జెట్‌లో ప్రస్థావన లేకపోవటం పట్ల తెలంగాణ ప్రభుత్వం నిరాశకు గురైంది. సమైఖ్యాంధ్ర విడిపోయి ఐదేళ్లు గడిచినా నేటికీ కేంద్రం ఏపీ విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయడం లేదని వాపోయారు.
ప్రశంసలే.. పైసల్లేవ్‌..
మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ ప్రాజెక్ట్‌లను ప్రశంసించిన నీతి ఆయోగ్‌.. ఆయా పథకాలకు రూ.24 వేల కోట్లను కేటాయించాలని కేంద్రానికి సిఫారసు చేసింది. కానీ, కేంద్రం 24 రూపాయలను కూడా కేటాయించలేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు విలేకరుల సమావేశం ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు గానీ పాలముర్రు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లకు గానీ జాతీయ హోదా ఇవ్వాలని పలుమార్లు కేంద్రానికి కోరింది. కానీ, బడ్జెట్‌లో వీటి ఊసే లేదు.
స్టీల్‌ ప్లాంట్, ఐటీఐఆర్‌ తుస్స్‌..
ఏ రాష్ట్ర అభివృద్ధికైనా ఫార్మా, ఐటీ రెండు కీలకమైన రంగాలు. తెలంగాణలో ముచ్చర్లలోని ఫార్మా సిటీ, శివారు ప్రాంతాల్లో ఐటీఐఆర్‌ ప్రాజెక్ట్‌లకు నిధులను కేటాయించలేదు. బయ్యారం వద్ద ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్, వరంగల్‌లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ వంటి వాటిని అటకెక్కించేసింది. వరంగల్‌లోని టెక్స్‌టైల్స్‌ పార్క్‌ బడ్జెట్‌లో ప్రసంగించలేదు. దేశంలోని 230 జిల్లాల్లో ప్రతి ఇంటికి తాగు నీటిని అందించేందుకు కేంద్రం రూ.10 వేల కోట్లను కేటాయించింది. అదే తెలంగాణలో మిషన్‌ భగీరథ కింద ఇంటింటికీ నల్లా నీళ్లు అందించేందుకు రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. కేంద్రం అందించే రూ.10 వేల కోట్లు సరిపోవని ఓ నిపుణులు అభిప్రాయపడ్డారు.
ములుగులో ట్రైబల్‌ వర్సిటీకి..
బడ్జెట్‌లో దేశంలోని 23 ఐఐటీలకు వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ.6,409.95 కోట్లను కేటాయించారు. ఇందులో రూ.4 కోట్లను వరంగల్‌ జిల్లాలోని ములుగులో నిర్మించనున్న ట్రైబల్‌ యూనివర్సిటీకి కేటాయించారు. ఫిబ్రవరిలో విడుదల చేసిన మధ్యంతర బడ్జెట్‌లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఐఐటీ–హైదరాబాద్‌కు రూ.80 కోట్ల నిధులను కేటాయించారు.

Related Posts

Latest News Updates