తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాల భూముల పర్యవేక్షణకు ప్రభుత్వం నడుం బిగించింది. అన్యాక్రాంతమవుతున్న భూములు, ఆస్తులపై ప్రత్యేక నజర్ పెట్టింది. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయ భూములు ఎంత ఉన్నాయి? ఎన్ని ఆక్రమణలకు గురయ్యాయో క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకు ప్రత్యేక సర్వే నిర్వహించనుంది. ఆ తర్వాత ఆయా స్థలాల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
హైదరాబాద్లోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగుల వేతన సమస్యల పరిష్కారం, ఆలయ భూముల పరిరక్షణ, లీజు భూములు, ఆన్ లైన్ సేవలు, తదితర అంశాలపై ఆ శాఖ అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సుధీర్ఘంగా సమీక్షించారు. దేవాలయ లీజు భూములపై ప్రత్యేక దృష్టి సారించామని, ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సబ్ లీజుకిస్తే చర్యలు..
ఆలయ భూములు కబ్జా చేసిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తుల లీజుల విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలన్నారు. నామమాత్రపు ధరకు దేవాదాయ శాఖకు సంబంధించిన షాపులను లీజుకు తీసుకొని తిరిగి వాటిని అధిక అద్దెకు సబ్ లీజుకు ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అద్దెల విషయంలో కూడా పునఃసమీక్ష చేసుకోవాలని, ఆలయ భూముల ద్వారా వచ్చే ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు.