Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

దేవుడు కరుణించాడు.. పూజారి అడ్డొచ్చాడు!

దేవుడు కరుణించినా… పూజారి అడ్డొచ్చాడనే సామెత దేశీయ బ్యాంకింగ్‌ విధానాలకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే? రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేట్లను తగ్గించినా సరే.. బ్యాంక్‌లు దాన్ని కొనుగోలుదారులకు పూర్తి స్థాయిలో బదిలీ చేయకపోవటమే!
ఆర్‌బీఐ గురువారం సమీక్షా సమావేశంలో రెపో రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 6 శాతంగా ఉన్న రెపో రెట్లను 5.75 శాతానికి తగ్గించేసింది. 2010 తర్వాత రెపో రేట్లు 6 శాతం కంటే తక్కువకు తీసుకురావటం ఇదే తొలిసారి అని కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) నేషనల్‌ ప్రెసిడెంట్‌ జక్షయ్‌ షా తెలిపారు.
నిధుల ప్రవాహం పెరుగుతుంది..
భారత ప్రభుత్వ డేటా ప్రకారం.. 2018–19 ఆర్ధిక సంవత్సరంలో చివరి త్రైమాసికంలో ఆర్ధిక వృద్ధి 5.8 శాతం తగ్గింది. అలాగే ద్రవ్య సంక్షోభం కారణంగా గత కొన్ని నెలలుగా నియంత్రిత ద్రవ్యోల్బణం 4 శాతం కంటే తక్కువగా ఉంది. ఇలాంటి క్షిష్ట ఆర్ధిక పరిస్థితుల్లో ఆర్‌బీఐ రెపో రేట్లను తగ్గించడం శుభ పరిణామం. దీంతో ఆర్ధిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహం పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా వాణిజ్య ఒత్తిళ్లు, ఆర్ధిక మాంధ్యం వంటి తరుణంలో రెపో రెట్ల తగ్గింపు నిర్ణయం భారత ఆర్ధిక వ్యవస్థ మీద సానుకూల పరిస్థితులను తీసుకొస్తుందని జేఎల్‌ఎల్‌ ఇండియా కంట్రీ హెడ్‌ అండ్‌ సీఈఓ రమేష్‌ నాయర్‌ తెలిపారు.
గృహ కొనుగోలుదారులకు చేరని ఫలితాలు..
ఆర్‌బీఐ రెపో రేట్లను తగ్గిచడం ఇది వరుసగా మూడోసారి. ఫిబ్రవరిలో 25 బీపీఎస్‌ పాయింట్లు, ఏప్రిల్‌లో మరొక 25 బీపీఎస్‌ పాయింట్లు.. మొత్తంగా 50 బీపీఎస్‌ పాయింట్లను తగ్గించిన విషయం తెలిసిందే. కానీ, బ్యాంక్‌లు కేవలం 21 బీపీఎస్‌ పాయింట్ల తగ్గింపు మాత్రమే కొనుగోలుదారులకు బదిలీ చేశాయి. రెపో రెట్ల తగ్గింపు అనేది రియల్‌ ఎస్టేట్‌ రంగం మీద ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. బ్యాంక్‌లు రుణ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంటుంది. అయితే ఆర్‌బీఐ గత రెండు సమీక్షల్లోనూ 50 బీపీఎస్‌ వరకు రెపో రెట్లను తగ్గించినప్పటికీ.. బ్యాంక్‌లు మాత్రం తనఖా వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచడం గమనార్హం. ఆర్‌బీఐ తగ్గించిన రెపో రేట్లను బ్యాంక్‌లు వాస్తవ రూపంలో కొనుగోలుదారులకు బదిలీ చేసినప్పుడే వడ్డీ రేట్లు తగ్గుతాయని ఆయన తెలిపారు.
అమ్మకాలు పుంజుకుంటాయ్‌..
ఇదిలా ఉంటే.. నిర్మాణ రంగంలో రెరా, బినామీ యాక్ట్, జీఎస్‌టీ వంటి పలు విప్లవాత్మక చట్టాల అమలు కారణంగా గృహాల అమ్మకాలు పుంజుకున్నాయి. 2018 జనవరి– మార్చి త్రైమాసికంతో పోల్చితే 2019 జనవరి– మార్చి మధ్య కాలంలో దేశంలో గృహాల అమ్మకాలు 29 శాతం వృద్ధి చెందాయి. ఇలాంటి శుభ పరిణామ సమయంలో రెపో రేట్ల తగ్గింపు ఫలితాలను బ్యాంక్‌లు కూడా వడ్డీ రేట్ల తగ్గిస్తే అమ్మకాలు మరింత పుంజుకుంటాయని నిపుణులు సూచిస్తున్నారు. రెపో రెట్ల తగ్గింపు కూడా బ్యాంక్‌లు కొనుగోలుదారులకు బదిలీ చేస్తే.. రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లకు తక్కువ వడ్డీ రేట్లకు ప్రాజెక్ట్‌ ఫండింగ్‌లు, కొనుగోలుదారులకు గృహ రుణాలు తక్కువ వడ్డీ రేట్లకు లభిస్తాయని ప్రాప్‌ ఈక్విటీ సీఈఓ అండ్‌ ఫౌండర్‌ సమీర్‌ జాసుజా తెలిపారు.

Related Posts

Latest News Updates