గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ప్రదర్శించారు. దీనిపై ఇఫి జ్యూరీ హెడ్ నడవ్ లాపిడ్ ముగింపు వేడుకల్లో మాట్లాడారు. ఈ సినిమా చూసి దిగ్భ్రాంతి చెందానని, ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రం అంటూ వ్యాఖ్యానించారు. దీంతో దీనిపై భారతీయులు, ఇజ్రాయిల్ ప్రభుత్వం కూడా మండిపడింది. అది ఆయన వ్యక్తిగత అంశమని, ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని భారత్ లో ఇజ్రాయిల్ కాన్సుల్ జనరల్ కొబ్బి పోషానీ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, భారత్ కు క్షమాపణలు చెబుతున్నామని ఆయన పేర్కొన్నారు. దీనికి ఇజ్రాయిల్ తో అధికారికంగా గానీ, అనధికారికంగా గానీ ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఇక.. నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలపై కశ్మీర్ ఫైల్స్ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడు అనుపమ్ ఖేర్ తీవ్రంగా స్పందించారు. ఇజ్రాయిల్ దర్శకుడి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు చూడలేకపోతే… నోరు మూసుకొని కూర్చోవాలంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. కొందరికి నిజాలను ఉన్నది ఉన్నట్లుగా చూపించే అలవాటు వుండదని, తమకు ఇష్టం వచ్చినట్లుగా మార్చి చూపిస్తుంటారని అన్నారు. అలాంటి వారు కశ్మీర్ నిజాలను జీర్ణించుకోలేకపోతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎందుకంటే కశ్మీర్ లో జరిగింది నిజమని, విషాదాన్ని అనుభవించిన వారిని కలిసి తెలుసుకోండని చురకలంటించారు.