Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

నిర్మాణ కార్మికులు దొరకట్లేదు!

ప్రస్తుతం దేశీయ నిర్మాణ రంగంలో 5 కోట్ల మంది కార్మికులున్నారు. ఇందులో నైపుణ్యమున్న కార్మికులు 2 కోట్ల లోపే. పస్తుతం 6.42 లక్షల మంది సివిల్‌ ఇంజనీర్లు, 65 వేల మంది ఆర్కిటెక్ట్‌లు, 18 వేల మంది ప్లంబర్లు అందుబాటులో ఉన్నారు. 2022 నాటికి ఈ రంగంలో 8.3 కోట్ల మంది కార్మికులు అవసరం ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కార్మికులతో పాటూ ప్లానర్స్, ఇంజనీర్స్, ప్రాజెక్ట్‌ మేనేజర్స్, సర్వేయర్స్, ఆర్కిటెక్ట్స్‌ వంటి అన్ని విభాగాల్లోనూ మానవ వనరుల అవసరం ఉంది.
ప్రస్తుతం తెలంగాణలో 2 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్‌లో 70–75 వేల మంది నిర్మాణ కార్మికులుంటారు. గతంలో ఒంగోలు, శ్రీకాకుళం ప్రాంతాల కార్మికులు హైదరాబాద్‌ నిర్మాణ రంగంలో పనిచేసేవాళ్లు. కానీ, ప్రభుత్వ ఉచిత పథకాల కారణంగా చాలా వరకు కార్మికుల వలస తగ్గిపోయింది. దీంతో బీహార్, మహారాష్ట్ర, కోల్‌కతా, వెస్ట్‌ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, అస్సాం, ఒరిస్సా రాష్ట్రాల కార్మికుల మీద ఆధారపడాల్సి వస్తుంది. కార్మికుల ధరలివే: రోజుకు మేస్త్రీకి రూ.700–900, లేబర్‌ (మగవారికి) రూ.450–500, ఆడవాళ్లకు 300–350, షటరింగ్‌కు చ.అ.కు రూ.12–14, రాడ్‌ బెండింగ్‌ టన్నుకు రూ.6,000.
ఎందుకు తగ్గిపోయారంటే?
– ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల్లోనే నిర్మాణ పనులు జరుగుతుండటంతో మెట్రో నగరాలకు కార్మికుల వలస తగ్గింది.
– సార్వత్రిక ఎన్నికల కని వెళ్లిన కార్మికులు తిరిగి పనులు రాకపోవటం.
– కార్మికుల్లో కష్టపడే తత్వం తగ్గిపోవటం. గ్రామీణ, పట్టణాల్లోని యువత ప్రధాన నగరాల్లో మేస్త్రీలు, కార్పెంటర్లుగా పనిచేయడానికి ఇష్టపడకపోవటం.
– వేతన అసమానతలు, కఠినమైన పని షెడ్యూల్డ్స్, ప్రసూతి సెలవులు లేకపోవటం. ప్రతికూల వాతావరణ పరిస్థితులు.
– కనీస అవసరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే తీరుస్తుండటం.
– ఉచిత విద్య, నిరుద్యోగ భృతి, ఫించన్లు, బీమా, ఇల్లు వంటివి ప్రభుత్వమే అందిస్తుండటం.
కార్మికుల కొరతతో ఏమవుతుందంటే?
– ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్మికులు, అరకొర పనిముట్లతో పూర్తి స్థాయిలో నిర్మాణ పనులను చేయలేరు.
– కొనుగోలుదారులకు ఇచ్చిన గడువులోగా ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తి కాదు. నిర్మాణం నాణ్యత దెబ్బతింటుంది.
– కార్మికులు, నిర్మాణ వ్యయం పెరుగుతుంది. కాబట్టి దాని ప్రభావం కంపెనీ కార్యకలాపాల మీద పడుతుంది. అంతిమంగా స్థిరాస్తి ధరలు పెరుగుతాయి.
– కంపెనీలకు నైపుణ్యమున్న మానవ వనరుల నియామకం, శిక్షణ భారంగా మారుతుంది.
టెక్నాలజీనే సరైన మందు..
నిర్మాణ పనుల్లో సాంకేతికతను వినియోగించడం ద్వారా కార్మికుల కొరతను అధిగమించవచ్చు. 80 శాతం కార్మికుల కొరతను టెక్నాలజీ భర్తీ చేస్తుంది. ఉదాహరణకు హై రైజ్‌ భవనాల్లో మైవాన్‌ టెక్నాలజీ, ప్రీ–కాస్ట్‌తో వాల్స్, కాలమ్స్, బీమ్స్‌ల ఏర్పాటు, రోబోటిక్స్‌తో పెయింటింగ్‌ వంటివి. నిర్మాణ పనుల్లో సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కూడా ముందుకురావాలి. పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. డెవలపర్ల సంఘాలతో కలిసి ప్రభుత్వం కార్మికులకు నైపుణ్య శిక్షణతో పాటూ పూర్తి స్థాయి పనిముట్లను సమకూర్చాలని సూచిస్తున్నారు.
చిన్న, మధ్య స్థాయి డెవలపర్లకు చుక్కలే..
హై రైజ్‌ భవనాలు, ఒకే రకమైన గృహ సముదాయాలకు, కమర్షియల్‌ ప్రాజెక్ట్‌లకు మైవాన్‌ షటరింగ్‌ టెక్నాలజీ కరెక్ట్‌. చిన్న ప్రాజెక్ట్‌లకు ఈ టెక్నాలజీని వినియోగించలేం. ఎందుకంటే డెవలపర్లకు వ్యయా భారంగా మారుతుందని ఓ డెవలపర్‌ తెలిపారు. నైపుణ్యమున్న కార్మికుల కొరత కారణంగా 100 మంది పనిచేయాల్సిన చోట 20 మంది మాత్రమే ఉంటున్నారని పేర్కొన్నారు. 7–8 అంతస్తుల్లోపు నిర్మాణాలు చేపట్టే 85 శాతం చిన్న, మధ్య స్థాయి డెవలపర్లకు కార్మికులు దొరక్క ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates