హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) భవన నిర్మాణ, లే అవుట్ అనుమతుల మంజూరులో జాప్యాన్ని తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. నిర్మాణ అనుమతుల దరఖాస్తులో షార్ట్ఫాల్స్ ఎందుకు, ఎక్కడ జరుగుతుందన్న అంశాలపై అధికారులు దృష్టిసారించారు. భవన నిర్మాణ ప్లానర్స్, ఆర్కిటెక్చర్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్లు అవగాహనరాహిత్యం కారణంగా ఈ షార్ట్ఫాల్స్ అవుతున్నాయని తేల్చారు.
ప్లానర్స్, ఇంజనీర్స్, ఆర్కిటెక్చర్స్ నిర్లక్ష్యం..
భవన నిర్మాణం, లే అవుట్ అనుమతుల కోసం దరఖాస్తు చేసే సమయంలో రిజిస్టర్డ్ సేల్డీడ్, ఎన్కంబరెన్స్, నాలా సర్టిఫికెట్స్తో పాటూ హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్లో సదరు భూమి ఏ జోన్లో ఉందనే వివరాలతో కూడిన ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్ కూడా నిక్షిప్తం చేయాలి. నాలాలు, చెరువులు, కుంటల సమీపంలో ఉంటే ఇరిగేషన్ విభాగం నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ)ని కూడా సమర్పించాలి. కొన్ని సందర్భాల్లో ఫైర్ ఎన్వోసీని కూడా నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. ఇలా నిర్మాణ అనుమతులకు అవసరమైన దస్తావేజులు, ధ్రువీకరణ పత్రాలు, ఎన్వోసీలను అప్లోడ్ చేయడంలో ప్లానర్స్, ఆర్కిటెక్చర్స్, ఇంజనీర్లు నిర్లిప్తత వ్యక్తం చేస్తున్నారు. దీంతో దరఖాస్తు షార్ట్ఫాల్స్కు గురవుతున్నాయి.
తప్పు చేస్తే లైసెన్స్లు రద్దు..
డాక్యుమెంట్ల సమర్పణలో నిర్లక్ష్యంగా వ్యహరించి షార్ట్ఫాల్స్కు కారణమవుతున్న ప్లానర్స్, ఇంజనీర్స్, ఆర్కిటెక్చర్స్ మీద చర్యలు తీసుకునేందుకు మరోసారి హెచ్ఎండీఏ సిద్ధమైంది. గతంలో నిర్లక్ష్యంగా వ్యహరించిన 15 మంది లైసెన్స్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. మరికొందరివి కొంతకాలం పాటు నిలిపివేశారు కూడా. ఈ చర్యలతో ఉలిక్కిపడిన ప్లానర్లు, అర్కిటెక్ట్లు, స్ట్రక్చరల్ ఇంజనీర్లు అన్నీ సక్రమంగా ఉన్నాయని రూడీ అయ్యాక దరఖాస్తులు చేయడంతో షార్ట్ఫాల్స్తో ఇబ్బందులు లేకుండా హెచ్ఎండీఏకు ఆదాయం పెరిగింది. తాజాగా ఆయా లైసెన్స్డ్ అర్కిటెక్ట్లు, ప్లానర్లు, స్ట్రక్చరల్ ఇంజనీర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది.