హిందుస్తాన్ శానిటరీవేర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (హెచ్ఎస్ఐఎల్) తెలంగాణలోని ప్లాంట్ను విస్తరిస్తోంది. ట్రూఫ్లో బ్రాండ్ పేరుతో ప్లాస్టిక్ పైప్స్, ఫిట్టింగ్స్ తయారీలో ఉన్న హెచ్ఎస్ఐఎల్కు పటాన్చెరు వద్ద ఉన్న ప్లాంట్ ఉంది. వార్షిక తయారీ సామర్థ్యం ప్రస్తుతం 30,000 మెట్రిక్ టన్నులు. 2022 మార్చికల్లా ఇది 60,000 మెట్రిక్ టన్నులకు చేరనుందని హెచ్ఎస్ఐఎల్ పైప్స్ విభాగం ప్రెసిడెంట్ రాజేశ్ పజ్నూ మీడియాకు వెల్లడించారు. ‘విస్తరణకు రూ.150 కోట్లు వెచ్చిస్తున్నాం. ఇప్పటికే అత్యాధునిక తయారీ కేంద్రం కోసం రూ.180 కోట్లు పెట్టుబడి చేశాం. 1,200 రకాల విడిభాగాలను ఉత్పత్తి చేస్తున్నాం. 2018 ఆగస్టు 9న ఈ ప్లాంటులో తయారీ ప్రారంభమైంది. తొమ్మిది నెలల్లోనే రూ.130 కోట్ల టర్నోవర్ సాధించాం. ఇందులో 20 శాతం తెలంగాణ, ఏపీ నుంచి సమకూరింది. 2021–22లో రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధించడం ద్వారా వ్యవస్థీకృత రంగంలో టాప్–5 స్థానానికి చేరుకోవాలన్నదే మా లక్ష్యం. ఈ ఏడాది చివర్లో సార్క్ దేశాలకు ఎగుమతులు ప్రారంభిస్తాం. వ్యవసాయ రంగానికి అవసరమైన ప్లాస్టిక్ పైపుల తయారీలోకి కొద్ది రోజుల్లో ప్రవేశిస్తాం. 2022లో మరో ప్లాంటు ఉత్తరాదిన వచ్చే అవకాశం ఉంది’ అని వివరించారు.