ఒకప్పుడు గ్రామంగా ఉన్న బోడుప్పల్ ఇప్పుడు మహా పట్నంగా మారింది. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారి దిన దినాభివృద్ధి చెందుతుంది.
సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి వైపు అడుగులేస్తుంది. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీరు, రోడ్ల అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పచ్చదనం పెంపొందించడంలో ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలుస్తోంది.
అభివృద్ధి శరవేగం..
పల్లె వాతావరణంలో ఉన్న బోడుప్పల్ రానురానూ మహా పట్నంగా మారింది. గ్రామపంచాయతీ హయాంలో కనీస సదుపాయాలకు నోచుకోలేకపోయింది. మున్సిపాలిటీగా ఏర్పడిన తరువాత రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పారిశుద్ధ్య నిర్వహణ పనులు, తాగునీరు, వీధి దీపాలు, పచ్చదనం పరిశుభ్రత వంటి పలు సౌకర్యాలకు కొదవ లేకుండా పోయింది. విస్తరిస్తున్న కొత్త కొత్త కాలనీలకు తోడు సమస్యలు సైతం అదే రీతిలో పెరుగుతున్నాయి. అయినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ కారణంగా సమస్యలు అన్ని పరిష్కరించబడుతూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌ను ఆనుకుని ఉండడంతో అభివృద్ధి మరింత వేగంగా చెందుతుంది.
1957లో గ్రామపంచాయతీగా…
బోడుప్పల్ గ్రామ పంచాయతీ 1957లో ఏర్పడింది. అప్పుడు తొలి సర్పంచ్‌గా దళిత సామాజిక వర్గానికి చెందిన బొమ్మక్ చిత్తారి ఎన్నికయ్యారు. అప్పడు కేవలం 15 వందల జనాభా మాత్రమే ఉండేది. గ్రామ పంచాయతీకి నిధులు ఏమీ లేవు. ఒక చిన్న పెంటుటింట్లో గ్రామ పంచాయతీని నిర్వహించే వారు. గ్రామంలో ముఖ్యంగా వ్యవసాయం, పశు సంపద, కూరగాయలు వృత్తులపై ప్రజలు జీవనాధారం కొనసాగించే వారు. 2016 ఏప్రిల్ 10వతేదీ వరకు గ్రామపంచాయతీగా కొనసాగింది. తరువాత బోడుప్పల్ మున్సిపాలిటీగా ఏర్పడింది.
20 చ.కి.మీ.; 163 కాలనీలు..
బోడుప్పల్ మున్సిపాలిటీ 20 చ.కి. మీ విస్తీర్ణంలో ఉంది. మొత్తం 163 కాలనీలున్నాయి. ప్రస్తుత జనాభా 1,30 లక్షలు. 2011 జనాభా లెక్కల ప్రకారం 48.225 మంది. వారిలో పురుషులు 24,616 మంది కాగా మహిళలు 23,609 మంది ఉన్నారు. ప్రస్తుతం ఓటర్లు 71,296 మంది ఉన్నారు. వారిలో పురుషులు 37,103 మంది, మహిళలు 34,193 మంది ఉన్నారు. మున్సిపల్ సంవత్సర ఆదాయం రూ 20 కోట్లు.
అనువైన నివాస ప్రదేశం..
బోడుప్పల్ ప్రాంతం పేద, మధ్య తరగతి ప్రజలు నివాసం ఉండేందుకు అనువైన వాతావరణం. తూర్పు వైపు పోచారం, పడమర వైపు ఉప్పల్ చిలుకానగర్, ఉత్తరం చర్లపల్లి ఐలా, దక్షణం వైపు ఫీర్జాదిగూడ మున్సిపాలిటీ ఆనుకుని ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌ను ఆనుకుని ఉండడం, నివాస యోగ్యం కాబట్టి నగరానికి చెందిన పేద, మధ్యతరగతి ప్రజలు, చిన్న చిన్న చిరు ఉద్యోగులు ఇక్కడ స్థలాలు కొనుగోలు చేసి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. మున్సిపాలిటీగా ఏర్పడిన తరువాత మౌలిక సౌకర్యాల కల్పనకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీరు, రోడ్ల అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పచ్చదనం పెంపొందించడంలో ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలుస్తుంది. సౌకర్యాలు కల్పించడంలో మేడ్చల్ జిల్లాలో ప్రథమ స్థానంలో నిలుస్తుంది.